Mynampally On Harish Rao |
విధాత: బీఆరెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాకు ముందే మాల్కాజిగిరి ఎమ్మెల్యే తిరుగుబాటు స్వరం వినిపించారు. మంత్రి హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని మైనంపల్లి చేసిన విమర్శలు, హెచ్చరికలు బీఆరెస్‌లో కలకలం రేపాయి. మల్కాజిగిరిలో నేను, మెదక్‌లో నా కుమారుడు రోహిత్ ఇద్దరం పోటీ చేస్తామని, మెదక్‌లో హరీశ్ రావు పెత్తనం ఏంది? మెదక్ అభివృద్ధి కాకపోవడానికి మంత్రి హరీశ్ రావునే కారణమని, మెదక్‌లో హరీశ్ రావు వేలు పెడితే.. నేను సిద్దిపేటలో పెడతానంటు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
బీఆరెస్‌లో అగ్రనేతల్లో ఒకరైన మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి బాహటంగా హెచ్చరికలు చేసే స్థాయిలో మాట్లాడిన తీరు ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడికి మెదక్ బీఆరెస్ టికెట్ రాదన్న సమాచారం తెలుసుకుని అందుకు హరీశ్‌రావు కారణమన్న కోపంతో ఆయనపై ఫైర్ అయ్యారు.
హరీశ్‌రావు గతం గుర్తుంచుకోవాలని, తన నియోజకవర్గం వదిలి మా జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటంటు మండి పడ్డారు. హరీశ్‌రావు బట్టలూడదీసే వరకు నిద్రపోనన్నారు. సిద్ధిపేటలో హరీశ్‌రావు అడ్రస్ గల్లంతు చేస్తానని, ఆయన ఇప్పటికే అక్రమంగా లక్ష కోట్లు సంపాదించారని మైనంపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు.
తాను ఇప్పటికి బీఆరెస్‌లోనే ఉన్నానని, తనకు పార్టీ టికెట్ ఇచ్చిందని, అయితే తన కుమారుడికి ఇవ్వలేదన్నారు. మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని మైనంపల్లి స్పష్టం చేశారు. హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన విమర్శల నేపధ్యంలో ఆయన బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వినిపిస్తుంది.
హరీశ్ రావు వంటి బీఆరెస్ అగ్రనేతపై మైనంపల్లి చేసిన విమర్శల దాడి వెనుక మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆరెస్ టికెట్ల ఖరారులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితల మధ్య ఆధిపత్య పోరు సాగిందని, వారి మధ్య రేగిన అంతర్గత కలహాల నేపధ్యంలోనే కేటీఆర్ అండతో హరీశ్‌రావుపై మైనంపల్లి విమర్శలు చేశారన్న ప్రచారం సాగుతుంది.
Talasani | కేటీఆర్ సమక్షంలో.. బైంసా మార్కెట్ చైర్మన్‌ను చెంపదెబ్బ కొట్టిన మంత్రి తలసాని