విధాత: గ్యాంగ్‌స్టర్ నయీం ప్రదాన అనుచరుడు శేషన్న పోలీసుల అదుపులో ఉన్నాడు. కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న సోమవారం కొత్తపేట్‌లోని ఓ రెస్టారెంట్‌లో సెటిల్‌మెంట్ చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 9 MM తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నారు.
నయీంతో కలిసి శేషన్న అనేక సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డాడు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శేషన్న పీపుల్స్‌వార్‌లో పని చేసిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిశాడు.
కాగా.. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత.. అతని ప్రధాన అనుచరుడు శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. కాగా.. ఇప్పుడు అతని దగ్గర తుఫాకీ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే పిస్టల్ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది.. ఇప్పటివరకు ఆయన నిర్వహించిన సెటిల్మెంట్‌లు, ఆయనకు ఆశ్రయం కల్పించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇంకా నయిమ్ ఆస్థులు, డంప్‌లకు సంబంధించి కూడా శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా శేషన్న నుంచి పలు వివరాలు సేకరించనున్నారు.