Site icon vidhaatha

MULUGU | కాంగ్రెస్‌కు ధీటైన అభ్యర్థిగా.. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి

MULUGU |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో ములుగు శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివాసీ కోయ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలైన ఆమెకు అవకాశం కల్పించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన నాగజ్యోతి ప్రాథమిక విద్య స్థానికంగా అభ్యనించారు. ఉన్నత విద్య హనుమకొండలో సాగించారు. ఎమ్మెస్సీ, బీఎడ్ చదివింది. వాజేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన ఎట్టి జగదీష్‌తో వివాహం జరిగింది.

నాగజ్యోతి తల్లిదండ్రులిద్దరూ మావోయిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు. తండ్ర బడే నాగేశ్వర్ రావు అలియాస్ ప్రభాకర్ ఏటూరునాగారం దళ కమాండర్‌గా పని చేస్తూ ఎన్ కౌంటర్‌లో మృతిచెందారు. తల్లి రాజేశ్వరి దళ సభ్యురాలిగా పనిచేశారు. నాగజ్యోతి బాబాయ్ బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ మావోయిస్టు పార్టీ నాయకునిగా పనిచేస్తున్నారు. సీతక్కకు పోటీగా ఈ అంశాలన్నీ ఆమె గెలుపునకు పరోక్షంగా దోహదం చేస్తాయని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.

సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానం

నాగజ్యోతి 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాల్వపల్లి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం మే నెలలో తాడ్వాయి జడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ములుగు జడ్పీ వైఎస్ చైర్మన్ గా పనిచేశారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకస్మిక మృతితో నాగజ్యోతి ఇంచార్జ్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ కు ధీటైన అభ్యర్థిగా..

గత కొంతకాలంగా ములుగులో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేటసాగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 2018 ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ పోటీ చేసి సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు. చందూలాల్ మృతి చెందినప్పటి నుంచి ఈ సెగ్మెంట్ లో బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక పరశురాం నాయక్ టికెట్ ఆశించారు. ఒక దశలో మంత్రి సత్యవతి రాథోడ్ ను పోటీలోకి దింపాలని భావించినప్పటికీ ఆమె ఆసక్తి కనబరచకపోవడంతో నాగజ్యోతి వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపింది. గత కొద్ది రోజులుగా నాగజ్యోతి నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం టికెట్ అధికారికంగా ప్రకటించడంతో ఆమె మరింత పర్యటనలు చేసే అవకాశం ఉంది.

Exit mobile version