Site icon vidhaatha

30న రాహుల్ పాదయాత్రకు.. నల్గొండ కాంగ్రెస్ శ్రేణులు

విధాత: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో పాదయాత్ర ఈ 30వ తేదీన జడ్చర్ల నుంచి బాలానగర్ చేరుకునే క్రమంలో పాదయాత్రలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనేలా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జన సమీకరణకు పూనుకుంది.

ప్రస్తుతం పాదయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్ర జడ్చర్ల నుంచి షాద్ నగర్ వరకు వయా బాలానగర్ మీదుగా మ.3 గంటల నుంచి సా.7 గంటల వరకు కొనసాగనుంది. అయితే.. రాహుల్ గాంధీ పాదయాత్రకు జన సమీకరణ బాధ్యతలను నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుల కు ఏఐసీసీ, పీసీసీ అప్పగించింది.

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలోని నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు 30న కొనసాగే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనెలా ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

పాదయాత్రలో పాల్గొనే వారికి మధ్యాహ్నం భోజనాలు బాలానగర్‌లో, రాత్రి భోజనాలు షాద్ నగర్‌లో ఏర్పాటు చేసినట్లు ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొనాలని ఉత్తమ్ కోరారు.

Exit mobile version