Site icon vidhaatha

ఖమ్మం BRS సభకు నల్గొండ గులాబీ శ్రేణులు.. జన సమీకరణకు భారీ ఏర్పాట్లు

విధాత: ఖమ్మం వేదికగా బుధవారం నిర్వహించనున్న బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు రంగం సిద్ధమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, హుజూర్‌న‌గర్, కోదాడ, తుంగతుర్తి, నకిరేకల్, మిర్యాలగూడ సహా ఇతర ఆరు నియోజకవర్గాల నుండి జన సమీకరణకు బిఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది.

జిల్లా మంత్రి జి. జగదీష్‌రెడ్డి ఖమ్మం సభకు ఆయా నియోజకవర్గాల నుండి గులాబీ శ్రేణులను, ప్రజలను తరలించేందుకు పార్టీ యంత్రాంగానికి ఇప్పటికే అవసరమైన మార్గదర్శకం చేశారు.

ప్రధానంగా ఖమ్మంకు దగ్గరలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌న‌గర్, తుంగతుర్తి, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గం నుండి ఎక్కువగా జన సమీకరణపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. సిపిఐ, సిపిఎంల రాష్ట్ర కార్యదర్శులు సైతం ఖమ్మం సభకు హాజరవుతుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ పార్టీల కేడర్ సైతం ఈ సభకు తరలి వెళ్ళనున్నారు.

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బల ప్రదర్శన అన్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖమ్మం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభను విజయవంతం చేయడం ద్వారా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సైతం బిఆర్ఎస్ ప్రభావం పడే రీతిలో సభను సక్సెస్ చేయాలని గులాబీ నాయకత్వం పట్టుదలగా జన సమీకరణకు పూనుకుంది.

ఇంకోవైపు జాతీయ రాజకీయాల్లో బిఆర్ఎస్ కీలక భూమికకు పోషించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా ఖమ్మం సభకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులను కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో కూడా ఫోకస్ గా మారిపోయింది.

ఖమ్మంలో బుధవారం జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరు కాబోతున్న కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు బుధవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఖమ్మం సభకు వెళ్లనున్నారు. వారంతా మంగళవారం ప్రగతిభవన్‌లో అల్పాహారం పిదప రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి దర్శనానంతరం ఖమ్మం సభకు హాజరు కానున్నారు.

Exit mobile version