Site icon vidhaatha

Revanth Reddy | BRS తొత్తుల పేర్లు.. రెడ్‌బుక్‌లో రాస్తాం: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy |

విధాత: ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. బీఆరెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే అధికారుల పేర్లను తప్పకుం డా రెడ్బుక్లో రాస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కోకాపేట భూములు, మైనార్టీల సమస్యలపై ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు.

తనను ఓడించేందుకే సీఎం కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు చెప్పినా తనకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదని అన్నారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న తనకు సెక్యూరిటీని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ప్రభుత్వం కేసీఆర్‌కు అడిగినంత సెక్యూరిటీ ఇచ్చిందని గుర్తుచేశారు.

‘నేను ప్రజల మనిషిని. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా పోతాను’ అని రేవంత్రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కూడా వెళ్లలేరని ఎద్దేవా చేశారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలే తన సైన్యమని, తన రక్షణను వాళ్లే చూసుకుంటారని అన్నారు. సెక్యూరిటీ పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడే వాడిని కాదన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ తాబేదారులు అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదారులుగా ఉన్నారని రేవంత్ ఆరోపించారు.

ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసేందుకు కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెడితే వదిలిపెట్ట బోమన్నారు. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, నర్సింగ్‌రావు లాంటి అధికారులనే తాను అంటున్నానని స్పష్టంచేశారు. ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయం లో ఎలా మౌనంగా ఉంటామని ప్రశ్నించారు. అధికారులకు రాజకీయాలతో ఏం సంబంధమని అన్నారు.

పొత్తులపై ఏఐసీసీదే నిర్ణయం

పొత్తుల విషయం ప్రస్తావించగా.. ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఏఐసీసీ చూసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ, మైనార్టీల తేడాలుండవని, మైనార్టీ నాయకులు తమ పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్నారని చెప్పారు. మైనార్టీల కోసం బీఆరెస్ చేసిందేమీ లేదన్నారు. మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. మైనార్టీ ఓట్లను బీజేపీకి కేసీఆర్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరేసరికి కమలంగా మారిపోతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజావ్యతిరేక బిల్లుకు బీఆరెస్ మద్దతు పలికిందని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ ఒకటేనని రేవంత్ పునరుద్ఘాటించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి.. ఎక్కడికైనా వెళ్లి తాను చెబుతానన్న రేవంత్.. బీఆరెస్ నాయకులు అలా చెప్పగలుగుతారా? అని సవాలు విసిరారు.

కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మైనార్టీలకు ఒక్క పర్సెంటేజీ కూడా దక్కలేదన్నారు. బీఆరెస్ నేతలు ఒక్క ఎకరానికి వందకోట్లు పెట్టగలిగే స్థాయికి ఎదిగారని, పేదలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారరని చెప్పారు. కోకాపేట, బుద్వేల్‌లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. అక్కడ భూములు కొన్నది బీఆరెస్ నేతలు, కేసీఆర్ బినామీలేనని ఆరోపించారు.

Exit mobile version