Narsing Rao | నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తూ ఐదున్నరేళ్లుగా నరకం చూపిస్తున్నారు.. తాజా లేఖలో నిప్పులు చెరిగిన నర్సింగ్‌రావు

Narsing Rao ప్రజాస్వామిక వాదులతో తగువు పెట్టుకుంటే.. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లటం ఖాయం కేటీఆర్‌కు చెబితే.. తీపి కబుర్లు చెప్పారు.. వెనుక నాటకాలు కొనసాగిస్తూనే ఉన్నాడు ఆంధ్ర పాలకులు నన్ను వేధించలేదు కోటరీగా గుప్పెడు మంది ఇంద్రజాలికులు ప్రజలను నయవంచన చేస్తున్న సర్కార్‌ ఆత్మగౌరవం అంగడి సరుకుగా మారింది అణచివేతను తెలంగాణ సహించదు.. తెలంగాణ ప్రతి బిడ్డా తిరుగుబాటుదారుడే.. తాజా లేఖలో నిప్పులు చెరిగిన నర్సింగ్‌రావు విధాత: నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా కేటీఆర్‌ ఇవ్వలేదని […]

  • Publish Date - June 16, 2023 / 02:45 PM IST

Narsing Rao

  • ప్రజాస్వామిక వాదులతో తగువు పెట్టుకుంటే.. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లటం ఖాయం
  • కేటీఆర్‌కు చెబితే.. తీపి కబుర్లు చెప్పారు.. వెనుక నాటకాలు కొనసాగిస్తూనే ఉన్నాడు
  • ఆంధ్ర పాలకులు నన్ను వేధించలేదు
  • కోటరీగా గుప్పెడు మంది ఇంద్రజాలికులు
  • ప్రజలను నయవంచన చేస్తున్న సర్కార్‌
  • ఆత్మగౌరవం అంగడి సరుకుగా మారింది
  • అణచివేతను తెలంగాణ సహించదు.. తెలంగాణ ప్రతి బిడ్డా తిరుగుబాటుదారుడే..
  • తాజా లేఖలో నిప్పులు చెరిగిన నర్సింగ్‌రావు

విధాత: నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా కేటీఆర్‌ ఇవ్వలేదని ఘాటు లేఖ విడుదల చేసిన ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, తెలంగాణ వాది బీ నర్సింగరావు తాజాగా మరో లేఖను విడుదల చేశారు. ప్రభుత్వం తన ఫోన్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా ట్యాప్‌ చేస్తున్నదని అందులో ఆరోపించారు. తనను మానసికంగా వేధిస్తున్నదని, తనకు అందరినీ దూరం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నదని మండిపడ్డారు. లేఖ పూర్తిపాఠం ఇలా ఉన్నది..

పెనం నుంచి పొయ్యి లోకి..

నేను డాక్టర్‌తో మాట్లాడాలనుకున్నాను. కానీ ఫోనులో మాట్లాడలేని పరిస్థితి! నా జన్మదినం నాడు నా మిత్రుడు నాకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. కానీ, ఫోనులో వినరాని పరిస్థితి! నా సోదరుడు నాకో విషాదవార్త చెప్పాలనుకున్నాడు. కానీ, అతడు చెప్పేది నేను ఫోనులో వినలేని పరిస్థితి! ఒక పెద్దాయన మా ఇంటికి రావాలనుకున్నాడు. అతను ఆ విషయాన్ని ఫోనులో చెపుతుంటే నేను వినలేని పరిస్థితి!

తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య ఆధునిక హంగులతో నిర్మించిన “ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్” నుండే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ తన పర్యవేక్షణలన్నీ కొనసాగిస్తున్నది. వారికెందుకో నేను కూడా టార్గెట్ గా మారాను. నేను ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా దాన్ని అడ్డుకోవడం, లేకుంటే అవతలివాళ్ళు మాట్లాడేది నాకు వినబడకుండా చేయడం, వాళ్ళకు దినచర్య అయింది.

2014 నుండి నా ఫోన్ టాపింగ్‌కు గురైనా.. ప్రత్యేకంగా 2018 జనవరి నుండి నా ఫోన్ కాల్స్‌ను వాళ్లు అడ్డుకోవడం ప్రారంభించారు. గత ఐదున్నర సంవత్సరాల నుండి నాకు నరకం చూపిస్తున్నారు. ఈ లోకంతో నా సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచి వేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా, అలాగే ఒకటి-రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసి కేటీఆర్‌కు నా ఆవేదనను తెలుపుకొన్నాను. ఆయన నా ముందు కొన్ని తీపి కబుర్లు చెప్పి, వెనుక తన నాటకాలను కొనసాగిస్తూనే ఉన్నాడు!

గత ఐదున్నర ఏళ్లుగా నేనెక్కడికీ వెళ్లలేని, ఏమీ చెయ్యలేని పరిస్థితికి నన్ను గురి చేస్తూనే ఉన్నారు. అయినా దాన్నంతా నేను నిశ్శబ్దంగానే భరించాను. ఈ విధంగా వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకెంత కూ అర్థం కావడం లేదు. నేను గత 60 సంవత్సరాలుగా తెలంగాణ సాంస్కృతిక రంగంలో పని చేస్తున్నాను. వందలాది మంది కళాకారులతో సామాజిక అభ్యున్నతి కోసం జరిగే అనేకానేక కార్యక్రమాలలో పాల్గొన్నాను. వాటిని చిత్రీకరించే, అక్షర బద్ధం చేసే ప్రయత్నం చేశాను, ఇంకనూ చేస్తూనే ఉన్నాను.

నా సాంస్కృతిక రంగం, మరియు సినిమా రంగ కార్యక్రమాలు సమాజ పురోగతికి, తెలంగాణ విమోచనకు తోడ్పడ్డాయే గానీ, మరోరకంగా కాదు. ఆంధ్ర పాలకులు కూడా నన్ను ఏనాడూ, ఏ రకంగానూ నిలువరించలేదు. నేటి మన తెలంగాణ పాలకులు మాత్రం నన్ను ఇంత దారుణంగా మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, కాలర్ ఎగర వేస్తున్నారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మబలికేలా చూపెట్టే గుప్పెడు మంది ఇంద్రజాలికులను తనచుట్టూ ఒక కోటరీగా ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది ఈ ప్రభుత్వం.

నిత్యం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ, ఆత్మగౌరవాన్ని అంగటి సరుకుగా మార్చి, తమని ధిక్కరించిన ప్రతివాడినీ పావలాకు, ఆఠానాకు కొనేసి, తన గడీలచుట్టూ పహారా కాసే కాపలా కుక్కలుగా నియమించ చూస్తున్నది. కాదన్న నాలాంటి వారిపై ఇలాంటి దాష్టీకాలకు ఒడిగడుతున్నదీ ప్రభుత్వం. తెలంగాణ వచ్చిందన్న సంతోషం ఏమోగానీ, నాకు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, ముఖ్యంగా 2018 నుండి అన్ని రాత్రులూ అమావాస్య రాత్రులే! ఒక ప్రముఖుడిగా నా పరిస్థితే ఇలా ఉంటే, తెలంగాణలో సామాన్యుడి గతి ఏమవుతుంది?

ఈ పాలకులకు నేడు తెలియాల్సింది ఏమిటంటే, నా తెలంగాణ అణచివేతను ఎన్నటికీ సహించదు. ప్రజావ్యతిరేక పాలనను సాగనివ్వదు. ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిబిడ్డా తిరుగుబాటుదారుడే. నైజాం మెడలు వంచిన ధీరుడు తెలంగాణ రైతు. నిన్న మొన్నటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసిన అనేకమంది యువకులు, నేడు నా లాంటి వారికి ప్రాణవాయువునందిస్తున్నారు.

నన్నుగాని, నా లాంటి ప్రజాస్వామిక వాదులతో తగువు పెట్టుకుంటే, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. తెలంగాణ సాకారం తరువాత నాపై జరిగిన అణిచివేత, తెలంగాణలో మరెవ్వరిపై జరగడానికి వీలులేదు. నియంతల మెడలు వంచడానికి, తెలంగాణ పొత్తిళ్ళలోంచి ఉద్యమకెరటాలు ఎప్పటికీ ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉంటాయి. తెలంగాణే శ్వాసగా బ్రతికిన నాకు తెలంగాణ ప్రజలే కంచుకోట.

– బి. నరసింగరావు