New Parliament | సకల హంగులతో నిర్మించిన పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గత గురువారం ప్రధానిని కలిసి కొత్త భవనాన్ని ప్రారంభించాలని కోరారు. అయితే, ప్రస్తుతం అనేక లోపాలున్న పార్లమెంట్ భవనాన్ని.. కొత్త భవనం భర్తీ చేయనుందని పార్లమెంట్ సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న భవనంలో 550 ఎంపీలు, 250 మంది రాజ్యసభ్యులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి.
కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులకు సీటింగ్ సదుపాయం ఉందని తెలిపారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా జరిగిన డీలిమిటేషన్ ఆధారంగా లోక్‌సభ స్థానాల సంఖ్య 545 ఏర్పాటు చేయగా.. ఆ సంఖ్య ఇప్పటికీ మారలేదు. 2026 లోక్‌సభ వరకు లోక్‌సభ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో సభ్యులకు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. పాత భవనంలో మెరుగైన సీటింగ్ సదుపాయాలు లేవు. పరిమిత స్థలం కారణంగా భద్రతా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పాత భవనం.. కొత్త భవనంలో మార్పులు..
కొత్త పార్లమెంట్ భవనం దాదాపు 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. పాతదాని గురించి చెప్పాలంటే, ఇది వృత్తాకార భవనం, దీని వ్యాసం 170.69 మీటర్లు కాగా, చుట్టుకొలత 536.33 మీటర్లు. ఇది దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్త భవనంలో ప్రస్తుత పార్లమెంట్ హౌస్ లాగా సెంట్రల్ హాల్ లేదు. సెంట్రల్ హాల్‌లో కేవలం 440 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. అయితే, ఉమ్మడి సమావేశాలు జరిగే సమయంలో సీట్లు సరిపోయే అవకాశం లేదు. ఉభయ సభల సమయంలో లోక్‌సభ ఛాంబర్‌ను ఉపయోగించనున్నారు.
కొత్త పార్లమెంట్ అత్యాధునిక సాంకేతికత
సెంట్రల్ విస్టా వెబ్‌సైట్ ప్రకారం.. పాత భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం నిర్మించలేదు. అప్పటికే అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో కొత్త కేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా నీటి సరఫరా లైన్లు, మురుగు కాలువలు, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్, సీసీటీవీలు, ఆడియో-వీడియో సిస్టమ్స్ మొదలైన వసతులు కల్పించడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఇక కొత్త బవనంలో బయోమెట్రిక్స్, డిజిటల్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటేషన్, ట్రాన్స్‌లేషన్ సిస్టమ్‌లు, ఓటింగ్‌ను సులభతరం చేయడానికి మైక్రోఫోన్‌లతో సహా అత్యాధునిక సాంకేతికత ఏర్పాటు చేశారు. హాల్ లోపలి భాగంలో సౌండ్‌ను పరిమితం చేసేందుకు వర్చువల్ సౌండ్ సిమ్యులేషన్‌లు అమర్చారు. అలాగే పాత పార్లమెంట్ హౌస్‌లో 212 వాహనాల పార్కింగ్ సామర్థ్యం ఉంది. కొత్త పార్లమెంటు భవనంలో 900 వాహనాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు.
బ్రిటిష్ ఆర్కిటెక్‌లు నిర్మించిన పార్లమెంట్
ప్రస్తుత పార్లమెంట్ హౌస్ వలసరాజ్యాల కాలం నాటి భవనం. దీన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌లు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. కొత్త భవనాన్ని అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నేతృత్వంలో కొత్త భవనానికి డిజైన్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971కోట్లతో నిర్మించగా.. పాత పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.83లక్షలు ఖర్చయ్యాయి. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి 10 డిసెంబర్ 2022న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భవనాన్ని మూడేళ్లలో పూర్తి చేయగా.. పాత పార్లమెంట్ భవన నిర్మాణానికి ఆరేళ్ల (1921-1927) సమయం పట్టింది. కొత్త పార్లమెంట్ భవనానికి నేడు ప్రధాని ప్రారంభోత్సవం చేయనుండగా.. పాత పార్లమెంట్ భవనాన్ని 1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు.
పార్లమెంట్ కొత్తగా రాజ్యాంగ మందిరం..
పాత పార్లమెంట్ హౌస్‌లో రాజ్యాంగ మందిరం లేదు. కొత్త పార్లమెంటు ఆకర్షణగా నిలువనున్నది. రాజ్యాంగ మందిరం పైభాగంలో అశోక స్తంభం ఉంది. ఇది భారతీయ వారసత్వానికి చిహ్నంగా నిలువనున్నది. ఈ హాలులో రాజ్యాంగ ప్రతిని భద్రపరుస్తారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భారతదేశ మాజీ ప్రధానమంత్రుల వంటి గొప్ప వ్యక్తుల పెద్ద ఫొటోలు కొత్త పార్లమెంట్ హౌస్ హాల్స్‌ను అలంకరించనున్నారు.