విధాత, నల్గొండ: ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వచ్చి కొత్త పథకాలు ప్రకటిస్తున్నాడని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధు.. మునుగోడులో గిరిజన బంధు, రిజర్వేషన్లు అంటూ మోసపూరిత ఎత్తుగడలు వేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు.
సోమవారం మునుగోడు నియోజకవర్గం నారాయణపూర్ మండలం కేంద్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో పుట్టపాక, శేరిగూడెం, జనగాం, రాచకొండ, కోతులాపురం, పోర్లగడ్డతండా, ఐదుకోనల తండా, కంకణాల గూడెం ల నుండి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐలకి చెందిన 500 మంది రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ లో చేరారు.
ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పక్షం లేకుండా చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశాడని విమర్శించారు. మునుగోడు ప్రజల గొంతుకగా నిలబడేందుకు ఉప ఎన్నికల ధర్మ యుద్ధంలో నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించాలని కోరారు. 1400 యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు.
ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందన్నారు. కేసిఆర్‌ను గద్దె దింపాలంటే మోదీ, అమిత్ షాలతోనే అవుతుందన్న నమ్మకంతో బీజేపీ పార్టీలో చేరానన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికను ప్రపంచంలోని ప్రతి తెలుగు వారంతా గమనిస్తున్నారన్నారు.
నా రాజీనామాతో ఫామ్ హౌస్‌లో పడుకున్న సీఎం కేసీఆర్ ను మునుగోడుకు రప్పించానన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలంటే మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ పార్టీనీ గెలిపించాలని కోరారు.