విధాత: హైదరాబాద్ నగరంలో రోడ్లపై అడ్డగోలుగా వెళ్తామంటే ఇకపై కుదరదు. కాదూ కూడదు అంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ. 100, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వ్యవహరిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నారు.
సోమవారం (అక్టోబర్ 3) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు.
ఈ అంశంపై ఇప్పటికే అనేకసార్లు అధికారులతో సమావేశమైన సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆపరేషన్ “రోప్” (రిమూవల్ ఆఫ్ అబ్‌స్ట్రిక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్ ) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు.
ఫుట్‌పాత్‌లను దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు పార్కింగ్ చేస్తే రూ. 600 జరిమానా విధించనున్నారు. కాబట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని, వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ కోరారు.