Site icon vidhaatha

నిజంగా.. వీళ్లు ఎవరు వదిలిన బాణాలు!

విధాత: తెలంగాణలో ప్రస్తుతం యాత్రల కాలం నడుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తుండగా.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు పాదయాత్ర చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహుజన రాజ్యాధికారం కోసం పాదయాత్ర చేశారు. అయితే షర్మిల, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎవరు వదిలిన బాణాలు అనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా షర్మిల పాదయాత్ర వెనుక కేంద్రంలో అధికార పార్టీ ఉన్నదని, వారి ప్రణాళిక, కార్యాచరణనే ఆమె ఇక్కడ అమలు చేస్తున్నారనేది అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వీళ్ల యాత్ర వెనుక అసలు వ్యూహం ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తున్నది.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనే అన్నది అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. దాదాపు 70పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పునాదులు బలంగానే ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుంది. అంతేకాదు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు, దళితులు, క్రిస్టియన్లు, బడుగు బలహీన వర్గాల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ పార్టీకే ఉన్నాయి. వీటిని బ్రేక్‌ చేయాలి. తమకు అనుకూలంగా మలుచు కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

వీరిద్దరి మధ్య అంతర్గత అవగాహన మేరకే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు గండి కొట్టడానికే షర్మిలను తెలంగాణ రాష్ట్రంలో తిప్పుతున్నారు. ముఖ్యంగా ఓ మీడియా సంస్థ సాయంతో ఆమె పాదయాత్రకు ప్రచారంతో పాటు, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో ప్రాధాన్యం దక్కే బాధ్యతను వాట్సప్‌ యూనివర్సిటీ బ్యాచ్‌ చూసుకుంటున్నదని సమాచారం. అంతేకాదు ఏ నియోజకవర్గంలో ఆమె ఏమి మాట్లాడాలి. సీఎంపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై ఎలాంటి విమర్శలు చేయాలి, సామాన్య ప్రజలకు దగ్గర కావడానికి ఆమె ఎలా వ్యవహరించాలి అనేది మొత్తం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుసన్నల్లోనే జరుగుతున్నదని తెలుస్తోంది.

దీనికి కారణాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి. షర్మిల క్రిష్టియన్‌. ఇక్కడ ఆ సామాజికవర్గ ఓట్లు బాగానే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. అట్లనే దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ప్రతీ గ్రామంలో ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్‌ అంటే ఇప్పటికీ ప్రత్యేక అభిమానం ఉన్నది. వాళ్లల్లో కాంగ్రెస్‌ అభిమానులే ఎక్కువగా ఉన్నారు.

అలాగే దళితులు మొదటి నుంచి కాంగ్రెస్‌ వైపే ఉన్నారు. ఈ మూడు వర్గాల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉంటాయి. అందుకే క్రిష్టియన్‌ ఓట్లను, రాజశేఖర్‌రెడ్డి అభిమానుల ఓట్లను షర్మిల ద్వారా తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు చీల్చే ఎత్తుగడ అంటున్నారు. అలాగే దళిత సామాజిక వర్గంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రభావం ఉన్నది. ఆయన ప్రసంగాలు వారిని చాలా ప్రభావితం చేస్తున్నాయి.

మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన ఓట్లను బట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి సంస్థాగతంగా ఉన్న దళిత ఓటు బ్యాంకును దూరం చేయాలనేది కేంద్రంలోని పాలకుల వ్యూహంగా కనిపిస్తున్నది. అట్లనే ఆయన ద్వారా ఓట్ల చీలిక తమకే లాభం చేకూరుస్తుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తున్నది. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ బీజేపీ విధానాలను కూడా ఎండగడుతున్నారు.

కానీ ఆయన ఉన్న పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునే రాజకీయ నిర్ణయం మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. యూపీ ఎన్నికల్లో ఎస్పీని ఓడగొట్టడమే తన ధ్యేయమని మాయావతి బహిరంగంగానే ప్రకటించారు. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపునకు దోహదపడిందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇట్లా కేంద్ర పాలకులు కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చడానికి వీళ్లను ముందు పెట్టి వాళ్ల వ్యూహాలను అమలు చేస్తున్నారనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

Exit mobile version