- కాంగ్రెస్ పిలిస్తే వెళ్లి మాట్లాడుతానంటున్న నితీష్
- రాహుల్ జోడో యాత్ర ముగిసే వరకు వేచి చూస్తాం
- బీజేపీని ఓడించాలంటే బలమైన కూటమి కావాలి
విధాత: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే రాజకీయ పార్టీలు ముందస్తుగా ఎన్నికల ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బి.జె.పి.ని ఓడించడానికి తామే ప్రత్యామ్నాయమంటూ పలు పార్టీలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ప్రజలను గెలిపించేందుకు తాను బయలుదేరానని BRS అధినేత KCR ప్రకటించారు.
దేశంలో భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీల నేతలను కలుపుకొని పోతానని చెప్తున్నారు. దేశంలో బీజేపీకి తగిన ప్రత్యామ్నాయం బి.ఆర్.ఎస్. అని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలనే కొత్త థియరీతో ముందుకు వచ్చిన కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమై, ఎవరెవరు కేసీఆర్‌తో జత కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు, అదే రాష్ట్రానికి చెందిన RJD నేత, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ను కూడా KCR. బీహార్ వెళ్లి కలిసి వచ్చారు. కేసీఆర్ వారిని కలిసి వచ్చిన తర్వాత నితీష్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. మీ సారథ్యంలోనే ఎన్నికలకు వెళదామని చెప్పి వచ్చారు. బలమైన ప్రతిపక్ష కూటమి అవసరాన్ని వారు ఆ రోజు నొక్కి చెప్పారు.
అలాగే సీఎం కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి కలిసిన వారిలో ముఖ్యులైన మరాఠా నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు కాంగ్రెస్‌ను కాదని BRS. అధినేత కేసీఆర్‌తో కలిసి వచ్చేందుకు సిద్ధంగా లేరని స్పష్టమవుతున్నది. అయితే ఆయా పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు ప్రస్తుత పరిస్థితుల్లో KCRతో స్నేహంగానే ఉంటున్నారు.
కానీ ఈ స్నేహం ఎన్నికల్లో BRSతో కలిసి పని చేసే దిశగా ఉంటుందా? అనేది తేలాల్సి ఉన్నది. మరో వైపు తాజాగా నితీష్‌కుమార్.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసే వరకు వేచి చూస్తామని, పిలిస్తే వెళ్లి చర్చిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చలకు తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని కూడా చెప్పారు.
ఇప్పటి వరకైతే దేశవ్యాప్తంగా BJPని ఓడించడానికి కాంగ్రెస్‌తో పాటు ఇతర లౌకిక పార్టీలతో కలిసి పని చేయడానికి కమ్యూనిస్టులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికారు. అలాగే త్రిపురలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నారు.
ఆయా రాష్ట్రాల్లో BJPని ఓడించానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులు రాష్ట్రంలో BRSతో పొత్తుకు సిద్ధమయ్యారు. కర్ణాటకలో తాము BRSతో కలిసి పోటీ చేస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. ఇది మినహా మరే పార్టీ కూడా BRSతో కలిసి పని చేస్తామన్న ప్రకటన చేయలేదు.
BRS ఏర్పాటు తర్వాత ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రు లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రమే వచ్చారు. శరద్ పవార్ కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, కర్ణాటక ఎన్నికల్లో BRSతో పొత్తు పెట్టుకుంటానన్న కుమార స్వామి కానీ రాలేదు. దీనిపైనా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది.
అయితే ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయం ప్రారంభానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు వస్తున్నట్లు BRS తెలిపింది. అయితే ఇతర రాష్ట్రాల నేతలు ప్రారంభోత్సవాలకు, సభలకు వచ్చినా, రాకపోయినా.. ఎన్నికల నాటికి ఏ వైపు ఉంటారన్నదే ప్రధాన సంశయం.
సీఎం కేసీఆర్‌తో స్నేహంగా ఉంటున్న జాతీయ స్థాయి నేతలు చాలా మంది నేతలు దేశంలో BJPని ఓడించడానికి కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలోనే ఉన్నట్లు వారి ప్రకటనలను పరిశీలిస్తే అర్థమవుతున్నది. మరి.. కీలకమైన రాష్ట్రాల నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. BRS వెంట నడిచేది ఎవరో భవిష్యత్తులో తేలనున్నది.