విధాత : ఓ మహిళ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా.. గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. అలా 9 నెలల పాటు తిప్పారు. ఆరో నెలలో స్కానింగ్ చేసి.. సెప్టెంబర్ 22న డెలివరీ డేట్ ఇచ్చారు. ఇక సంతోషంతో ప్రసవానికి గర్భిణి తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ చేయగా, ఆమె గర్భంలో శిశువు లేదని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాం వాసి సత్యనారాయణతో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. ఈ ఏడాది జనవరిలో తన భార్యను కాకినాడలోని రమ్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు సత్యనారాయణ. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భవతి అని రిపోర్టు ఇచ్చారు. ఇక ప్రతి నెల రావాలని వైద్యులు సూచించారు ఆమెకు. ఆరో నెలలో మహాలక్ష్మికి స్కానింగ్ చేసి.. డెలివరీ డేట్(సెప్టెంబర్ 22) ఇచ్చారు. కాన్పు కోసమని మహాలక్ష్మి గోకవరంలోని తన పుట్టింటికి ఇటీవలే వెళ్లింది. ఆమె పేరెంట్స్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయగా, ఆమె గర్భవతే కాదని తేలింది.
దీంతో షాక్‌కు గురైన మహాలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన రమ్య ఆస్పత్రికి వెళ్లారు. తమను మోసం చేశారని ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహాలక్ష్మికి రమ్య ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్ నిర్వహించింది. ఆమె గర్భంలో శిశువు లేదని తేల్చారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు వైద్యురాలిని ప్రశ్నించగా, ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. వైద్యురాలు రాసిచ్చిన మందులు వాడటంతో బాధితురాలి పొట్ట పెద్దదైందని ఆమె తల్లి వాపోయింది. రమ్య ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.