విధాత: సంగారెడ్డి జిల్లాలోని మన్నాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు మొగుడంపల్లి మండలానికి సంబంధించి పంటల సాగు వివరాలు చెప్పాలని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. మంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో జహీరాబాద్ ఏడీఏ, మన్నాపూర్ ఏఈవో తడబడ్డారు.
అధికారుల తీరుపై మండిపడిన హరీశ్‌రావు రైతులు ఏ పంట ఎంత సాగుచేస్తున్నారో తెలియకుంటే మీరు ఏం పనిచేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లాల పర్యటనకు వచ్చే ముందు తాను అన్ని శాఖ వివరాలు తెలుసుకుంటానని మంత్రి వస్తున్నారని తెలిసినా అధికారులు వివరాలు లేకుండా రావడం సరికాదన్నారు.
వ్యవసాయ అధికారుల తీరుపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శరత్‌ను హరీశ్ రావు ఆదేశించారు. అంతకుమందు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో 2.17 కోట్లతో నూతనంగా నిర్మించిన ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలను మంత్రి ప్రారంభించారు.
అనంతరం జహీరాబాద్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా మోగుడంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మండల కేంద్రంలో సెంట్రల్ డివైడర్, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి, రైతు వేదికను ప్రారంభించారు.
అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు, మెదక్ ఎంపీ బీబీ పటేల్,ఎమ్మెల్యే మాణిక్ రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ శరత్, డిసిఎంఎస్ శివకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలను ప్రారంభించారు.