హైదరాబాద్: తనను విమానం ఎక్కనివ్వలేదని ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉందని పోలీసులకు ఫోన్ చేశాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకున్నది.
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ డయల్ 100కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. వెంటనే సీఐఎస్‌ఎఫ్, శంషాబాద్ పోలీసులు అప్రత్తమయ్యారు. ఆ తర్వాత ఎక్కడి నుంచి, ఎవరు ఫోన్ చేశారో ఆరా తీశారు. ఈ క్రమంలో భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.
విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రయ్య హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. ఆలస్యంగా రావడంతో అనుమతించని విమానాశ్రయ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. దాంతో భద్రయ్య డయల్ 100కు ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడు. సాంకేతిక ఆధారాలతో భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.