- రూరల్లో బలంగా ఉన్న వైసీపీ
- టీడీపీ మద్దతుదారు మీడియా సర్వేలో వెల్లడి
విధాత: చంద్రబాబు ఊహిస్తున్నంత ఈజీగా ఏపీలో పరిస్థితులు లేవట. జగన్ను.. ఇంకా మాట్లాడితే పులివెందులలో జగన్ను సైతం ఓడిస్తాం అని బీరాలు పలుకుతున్న టీడీపీ శ్రేణులకు ఒక చేదు వార్త.. అదేమిటంటే వాళ్ళు అనుకున్నంత సులువుగా ఏమీ లేదట.. జనంలో వైసీపీ బలంగానే ఉందట. ఈ సంగతి టీడీపీ అనుకూల మీడియా ఈమధ్య చేపట్టిన సర్వేలో తేలిందట.
మూడ్రోజుల కిందట పవన్ కళ్యాణ్ మోడీతో భేటి అయిన రోజునే చంద్రబాబు వెళ్లి ఫిల్మ్ సిటీలో రామోజీరావును కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సందర్భంగా రామోజీ రావు తమ ఈనాడు తరఫున చేపట్టిన సర్వే రిపోర్టును చంద్రబాబుకు అందించారని అంటున్నారు.
ఆ రిపోర్ట్ ప్రకారం ఏపీలో వైసీపీ ప్రభుత్వం బలంగానే ఉందని తేలిందట. ఏపీలో వైసీపీని ఢీ కొట్టేందుకు టీడీపీకి సొంత బలం సరిపోదని, పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని రామోజీ రావు చంద్రబాబుకు చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనతో పొత్తుతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాల్లో గట్టిగా వైసీపీని ప్రతిఘటించవచ్చని తేలినట్టు సమాచారం.
అదే విధంగా రాయలసీమలో ఈసారి హోరాహోరీ పోరు ఉండొచ్చని అంటున్నారు. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ సీమలో మంచి ఫలితాలు సాధించగా ఈసారి అలా ఉండకపోవచ్చని టీడీపీ కూడా గట్టిగానే పోరాడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
అర్బన్ ప్రాంతాలలో టీడీపీ ఓటింగ్ బాగా పెరిగిందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ బలంగా ఉందని సర్వేలో తేలిందట. రానున్న రోజుల్లో టీడీపీ అమలు చేసే వ్యూహాల బట్టి ప్రజల అభిప్రాయాల్లో మార్పు వస్తుందనే ఆశాభావంలో ఉన్నారు.