Site icon vidhaatha

NTR క‌నుబొమ్మ‌ల‌తో న‌టించ‌గ‌ల‌డు: జ‌క్క‌న్న‌

విధాత‌: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళిల కెరీర్ దాదాపు అటు ఇటుగా ఒకేసారి ప్రారంభమ‌య్యాయి. ఎన్టీఆర్ నటించిన రెండో చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ తో రాజమౌళి దర్శకునిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వారిద్దరి కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ చిత్రాలు వచ్చాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక రాజమౌళి ఎన్టీఆర్లు చాలా మంచి స్నేహితులు.

రాజమౌళికి జక్కన్న అనే మారు పేరును, ముద్దు పేరును పెట్టింది ఎన్టీఆరే. ఇక ఎన్టీఆర్ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే గ్యాప్ దొరికితే ఎన్టీఆర్ తో పని చేయాలని ఉబలాటపడుతుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే నటనలో, డైలాగ్ చెప్పడంలో, డాన్స్ చేయడంలో ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆయనది అందెవేసిన చెయ్యి.

ఈ విషయాలలో ఆయనకు నేటి తరంలో దీటైన నటుడు ఎవరూ లేరు. ఎంతమంది స్టార్లు ఉన్నా ఎన్టీఆర్ నటన ప్రతిభ, డ్యాన్సింగ్ స్కిల్స్ ముందు సరిపోర‌నే చెప్పాలి. ఇక విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు సృష్టించింది. అందరి ప్రశంసలు పొంది ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఆస్కార్ తుది జాబితాలో పోటీపడుతోంది. ఆస్కార్ ఓటింగ్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనికి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. స్క్రీనింగ్ అనంతరం వీరిద్దరూ అక్కడ మీడియాలో మాట్లాడారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలు పరస్పరం పొగడ్తలతో ముంచేత్తుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాజమౌళితో చేసిన సినిమాలే. నేను చాలాసార్లు విదేశాలకు వచ్చా. కానీ ఇలా సినిమా కోసం రావడం ఇదే తొలిసారి.

రాజమౌళి తెలుగు పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కేలా చేశారు. ఆయనకు 99% ఉండదు. 100కు 100% రావాలి అంటారు. ప్రతి చిన్న విషయాన్ని ఎంత గొప్పగానో పరిశీలిస్తారు. చిత్రం కోసం మేమంతా కష్టపడ్డాం. నాటు నాటు పాటకు మేం పడిన కష్టం ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మైమరిచిపోయాం… అన్నాడు.

ఇక రాజమౌళి మాట్లాడుతూ రామ్ చరణ్ తారక్‌లపై ప్రశంసలు కురిపించాడు. ఇద్దరూ గొప్ప డ్యాన్సర్లు. కొమరం భీముడో సాంగ్ నాకు చాలా ఇష్టం. నేను తీసిన చిత్రాలలో ఇదే నా ఫేవరెట్. ఈ పాటలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ కనుబొమ్మలపై మనం కెమెరా పెడితే వాటితో నటించగలడు అన్నారు.

గతంలో ఇదే విషయంపై సీనియర్ నటి కుష్బూ తో పాటు పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు ఇదే కితాబునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతైనా ఎన్టీఆర్ స్టామినా రోజు రోజుకి బాగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన దేశం గర్వించదగ్గర నటుడు కావడంలో సందేహం లేదు. దానికి తోడు రాజమౌళి వంటి మరికొందరు దర్శకులు ఆయనకు దొరికితే ఆయన ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుంటుంది…

Exit mobile version