Odisha Train Accident | ఒడిశా బాలాసోర్‌లో జరిగి ఘోర రైలు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై కేంద్రమంత్రి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధంఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
కేంద్రమంత్రుల సంతాపం
ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఘటన తర్వాత సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు వైమానిక దళం సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విచారం వ్యక్తం చేశారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ సైతం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.
సహాయక చర్యలను పరిశీలించిన ఒడిశా సీఎం
రైలు ప్రమాదం సంఘటనను తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ప్రత్యేక సహాయ కమిషనర్ (SRC) సహాయక చర్యలను పరిశీలించడానికి కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రైలు ప్రమాదం తర్వాత శుక్రవారం ఒడిశా నవీన్ పట్నాయక్‌తో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్‌లో మాట్లాడారు. తమిళ ప్రజలను సమన్వయం చేసేందుకు నలుగురు సభ్యుల ప్యానెల్‌ను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న తమిళులను రక్షించేందుకు ఒడిశా వెళ్లాల్సిందిగా రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్‌తో పాటు ముగ్గురు ఐఏఎస్ అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. 5-6 మంది సభ్యుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.