High Court |
ఉదయం 10:15 గంటలకు ప్రారంభించిన సీజే అలోక్ అరాధే
విధాత, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో కేసుల విచారణకు సంబంధించి ఆన్‌లైన్ లైవ్ ప్రసారాలను సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ప్రారంభించారు. ఉదయం 10:15 గంటలకు హైకోర్టులోని 29వ కోర్టు హాల్‌లో విచారణ లైవ్ ప్రసార సేవలను సీజే లాంఛనంగా ప్రారంభించడంతో, ఉదయం 10:30 గంటల నుంచి లైవ్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇదివరకే ఫస్ట్ కోర్టు హాల్‌లో లైవ్ ప్రసార సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సేవలు న్యాయవాదులు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీనిలో భాగంగా ఇక నుంచి మిగతా కోర్టుల్లో జరిగే విచారణలు కూడా న్యాయవాదులు, ప్రజలు వీక్షించే అవకాశం కలిగింది.
దీంతో ఇక నుంచి న్యాయవాదులు కూడా ఆన్‌లైన్ ద్వారా వాదనలు జరుపొచ్చని సీజే సూచించారు. భవిష్యత్‌లో న్యాయవాదులే కాకుండా వాదప్రతివాదుల నుంచి న్యాయమూర్తులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ నుంచే తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ ప్రారంభించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. అన్ని కోర్టులను ఆన్‌లైన్ లైవ్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువచేస్తామని సుప్రీంకోర్టు పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ హైకోర్టులో ఆన్‌లైన్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. లైవ్ ప్రసారాలతో పెండింగ్ కేసులు తగ్గే అవకాశం కాకుండా కేసులు సత్వరమే పరిష్కారమవుతాయన్నారు.