విధాత, హైదరాబాద్: మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉందంటూ.. భారత్ రాష్ట్ర సమితిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తమ పార్టీకి తప్పకుండా విజయం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా భారత్ రాష్ట్ర సమితిపై కేటీఆర్ మాట్లాడారు.
గత 8 నెలల నుంచి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, రైతులు, ప్రజా సంఘాలు, ఆర్థికవేత్తలతో కేసీఆర్ చర్చలు జరిపిన అనంతరమే బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. తమ లేఖపై ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. 2024 ఎన్నికలే తమ లక్ష్యమని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఢిల్లీ అభివృద్ధికి పంజాబ్ ప్రజలు ఆకర్షితులయ్యారు. దాంతో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో కూడా గెలిచారు. తెలంగాణ పథకాలకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మాకు పాజిటివ్ ఉంది. కర్నాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. కర్నాటక, మహారాష్ట్ర సర్పంచులు కూడా మమ్మల్ని తెలంగాణలో కలపమని అడుగుతున్నారు. తమ పార్టీ ప్రభావం పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం తప్పదని కేటీఆర్ అన్నారు.
గోల్ మాల్ గుజరాత్ మోడల్‌ను ఎక్స్‌పోజ్ చేయడమే మా స్ట్రాటజీ. ఏ అంశాలు చర్చకు రావాలో వాటినే పెడతం. మహారాష్ట్ర, కర్నాటకలో ఇవే చెప్తామన్నారు కేటీఆర్. తెలంగాణలో జరుగుతున్న పనిని సమర్థవంతంగా దేశానికి చెప్తాం. మాకంత నేర్పు, ఓర్పు ఉంది. మేం చేసిన పని చూపెట్టి ఓట్లు అడుగుతామన్నారు. ఒకటిన్నర సంవత్సరాల్లో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తమని చెప్పడం లేదు. బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడానికి 40 ఏళ్లు పట్టింది. మాకు అంత టైం పట్టకపోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.