- తీవ్రంగా తప్పుబట్టిన వీకీపీడియా ఆన్‌లైన్ న్యూస్‌పేపర్
విధాత: వాస్తవాలను తొక్కిపెట్టేందుకు గౌతమ్ అదానీ ఎంతకైనా తెగిస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి వీకీపీడియా వర్గాలు. ఏకంగా వీకీపీడియా పేజీలనే అదానీ కిరాయి వ్యక్తులు మార్చేస్తున్నారని వీకీపీడియా ఆన్‌లైన్ న్యూస్ పేపర్ ది సిన్ పోస్ట్ అంటున్నది. తమ దర్యాప్తులో అదానీ గ్రూప్ నియమించుకున్న అప్రకటిత కిరాయి ఎడిటర్లు వీకీపీడియా పేజీలకు సంబంధించి అక్రమంగా మార్పులు, చేర్పులు చేస్తున్నారని తేలినట్టు ది సిన్ పోస్ట్ చెప్తున్నది.
హిండెన్‌బర్గ్ రిసెర్చ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ గ్రూప్ ఒక్కసారిగా వార్తల్లో కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో గౌతమ్ అదానీ, ఆయన కంపెనీల వార్తలు, వివరాల అన్వేషణ కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదానీ కిరాయి వ్యక్తులు వీకీపీడియా పేజీల్లో అసలు సమాచారాన్ని కాకుండా తప్పుడు సమాచారాన్ని పెడుతున్నారని తాము గుర్తించినట్టు వీకీపీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
40కిపైగా అదానీ అప్రకటిత పెయిడ్ ఎడిటర్లు అదానీ కుటుంబం, ఆయన వ్యాపారానికి సంబంధించిన 9 ఆర్టికల్స్‌ను మార్చినట్టు తేలింది. వీకీపీడియా బహుళ ఖాతాలను దుర్వినియోగం చేస్తూండటంతో సదరు ఖాతాలను నిషేధించినట్టు వీకీపిడియా తెలిపింది. అదానీ ఆర్టికల్స్‌ను మార్చిన వారిలో ఒకరు ఓ కంపెనీ ఐపీ అడ్రస్‌ను వినియోగించినట్టు చెప్పింది. దీంతో ఉద్యోగులూ ఇందులో భాగమయ్యారన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది.
గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీ, మేనల్లుడు ప్రణవ్ అదానీతోపాటు అదానీ గ్రూప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లకు సంబంధించిన ఆర్టికల్స్ టాంపరింగ్‌కు గురైనట్టు చెప్తున్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్టు తర్వాత, అంతకుముందుకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కూడా మార్చేస్తున్నారని అంటున్నారు.