విధాత: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతున్నది అన్నది ఇప్పటికే సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వేల శాస్త్రీయత విషయంలో ఎవరి వాదనలు వారివే. ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో బ్యాలెట్ బాక్స్‌లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు ఏమీ మారదు. కానీ పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు సాగిన ఓటింగ్ పై రెండు రోజులుగా చర్చ నడుస్తోంది.
ఈ సమయంలో సుమారు 36 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళలో ఎక్కువ శాతం మంది బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ వాళ్ళతో పాటు కొంతమంది వాదన. లేదు ఆ ఓట్లలో కూడా టీఆరెఎస్‌కే ఎక్కువ పడ్డాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అలాకాదు టీఆరెఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ ఓట్లను పంచుకున్నాయి అని మరి కొందరి వాదన. ఈ ఓట్లే ప్రస్తుత ఉత్కంఠకు కారణం. దీనిపైనే కోట్ల రూపాయల బెట్టింగ్ సైతం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఓట్ల ఆధారంగానే బీజీపీ, టీఆర్‌ఎస్‌లో ఏ పార్టీ గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతాయంటున్నారు.
అయితే టీ20 మ్యాచ్ లా ఈ ఉత్కంఠ పోరులో కారు పార్టీ కమలం పార్టీని ఓవర్ టేక్ చేసి గెలువ బోతున్నదంటే.. ఏదైనా అద్భుతం జరిగి మునుగోడులో కమలం వికసించినా ఆశ్చర్యం లేదనే వాళ్ళు ఉన్నారు. కానీ 15వ తేదీ నుంచి పోలింగ్ రోజు రాత్రి వరకు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో తిరిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయం ప్రకారం ఒక శాతం తేడాతో అయినా మునుగోడు టీఆరెఎస్ ఖాతాలో పడనున్నది అని చెప్పారు. రేపే ఫలితం కాబట్టి ఏమీ జరగబోతున్నది అన్నది వెయిట్ అండ్ సీ.