Site icon vidhaatha

‘ఎవడ్రా మనల్ని ఆపేది’.. పవన్, మహేష్ ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్

విధాత: ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ కులం రంగుతో పాటు సినీ రంగును కూడా పులుము కుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈసారి జనసేనకు, దానితో పొత్తు పెట్టుకునే తెలుగుదేశంకు మద్దతు ఇస్తారని తేలిపోయింది. ఇక బాలయ్య అభిమానులు ఎలాగూ టీడీపీనే. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేనికి మద్దతు పలుకుతారో క్లారిటీ రావడం లేదు. మధ్యలో మహేష్ అభిమానుల వంతు వచ్చింది. వాస్తవానికి కృష్ణ కాంగ్రెస్ వాది. కానీ ఆయన గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈనాడు అనే సినిమాని తీశాడు. ఈ చిత్రం నాడు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌కు ఎంతో ఉపయోగపడింది.

ఆ తర్వాత కృష్ణ కాంగ్రెస్‌లో చేరి ఏలూరు నుంచి ఎంపీగా కూడా ఎంపికయ్యాడు. రెండోసారి ఎంపీగా ఓటమి పాలైన తరువాత కృష్ణ మరలా రాజకీయాల జోలికి పోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజకీయాలకు చాలా దూరం. ఆయన తనకు స్ఫూర్తిగా గల్లా జయదేవ్‌ని పేర్కొంటాడు. తన బావ అయిన గల్లా జయదేవ్ గల్లా కుటుంబం రాజకీయాలలో ఉన్నప్పటికీ మహేష్ బాబు మాత్రం రాజకీయంగా మౌనం వహించాడు. ఇప్పటివరకు ఆయన ఏ పార్టీకి మద్దతు పలికింది లేదు.

ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌కు పోటీ ఇచ్చే హీరో ఎవ‌రంటే మహేష్ బాబు పేరు చెప్పుకుంటారు. పవన్ తర్వాత మహేష్ బాబుకు అత్యధిక ఫాలోయింగ్ ఉంది. ఏదో పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ తన సినిమాలు తను చూసుకుంటాడు. షూటింగులు లేకపోతే ఫ్యామిలీతో గడిపేస్తాడు. ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తాడు.. లేదా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు.

ఇప్పటివరకు రాజకీయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు ఆయన్ని ఏపీ రాజకీయాల్లోకి లాగుతున్నారు. తాజాగా మహేష్ బాబు ఫోటోతో ఫ్లెక్సీ వెలిసింది. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు ఫోటో కింద మేమేరా మిమ్మల్ని ఆపేది అని రాసి ఉన్న ఫ్లెక్సీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఇటీవల వైసిపికి, జగన్‌కు వ్యతిరేకంగా జనసేన అభిమానులు అంటే పవన్ అభిమానులు ‘ఎవడ్రా మనల్ని ఆపేది’ అనే స్లోగన్‌తో ఫ్లెక్సీలు, పోస్టులు పెట్టారు. దానిమీద చిన్నపాటి యుద్ధమే జరిగింది. దానికి కౌంటర్ గానే మేమేరా మిమ్మల్ని ఆపేది అని రాసి ఉన్న ఫ్లెక్స్‌ని వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దాంతో మహేష్ అభిమానులు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మహేష్ బాబు గారి ఫ్యాన్స్.. వాళ్ళని ఆపడం కోసం అంత బ్యానర్ కట్టాలా? గాజువాకలో తిప్పిరెడ్డి, భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు కదా..! కాదు కూడదు అని గోల చేస్తే అసెంబ్లీ గేటు దగ్గర గేటు బాయ్ గోపాల్ ఎలానూ ఉన్నాడు మెడ పెట్టి గెంటేయడానికి.. అని ఈ పోస్ట్‌కి జత చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

Exit mobile version