Site icon vidhaatha

రాజాసింగ్‌కు పీడీ యాక్ట్‌ సరైందే: అడ్వైజరీ బోర్డు

విధాత, హైదరాబాద్‌: గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. తనపై నమోదు చేసిన పీడీయాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది.

రాజాసింగ్ పై 101కేసులు ఉన్నాయని వాటిలో 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని పోలీసులు అడ్వైజరీ కమిటీ దృష్టికి తెచ్చారు. అందుకే పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టి వేసినట్టుగా రాజాసింగ్ బోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కమిటీ సభ్యులు పోలీసుల వాదనతో ఏకీభవించారు. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించారు.

ఆయితే.. పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా బాయి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన భర్తను అరెస్ట్ చేసే సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. తన భర్తను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి సంబంధించిన పత్రాలు హిందీలో లేవని పిటిషన్ లో పేర్కొన్నారు.

మరోవైపు అడ్వైజరీ కమిటీకి లిఖితపూరక సమాధానం ఇవ్వడానికి హైదరాబాద్ పోలీసులు తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శితో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.

Exit mobile version