సేవ‌తోనూ ప్ర‌జ‌ల మ‌న‌సు గెల‌వొచ్చు: అమెరికా ప్ర‌గ‌తిశీల నేత ఎల్రిచ్‌

  • Publish Date - October 29, 2023 / 05:02 PM IST
  • కోటీశ్వ‌రుడిపై పోటీ చేసి గెలిచా
  • హ‌మాస్‌కు ఇజ్రాయెల్‌కు తేడాలేదు
  • ఎల్రిచ్ విధానం భార‌త్‌లో అవ‌స‌రం
  • ఎన్నారై నాగేంద‌ర్ మాధ‌వ‌రం
  • శ్ర‌మ దోపిడీ గుర్తించ‌కుంటే బానిస‌త్వ‌మే
  • సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి

విధాత‌: సిద్ధాంతాలు, భావజాలం ముందుపెట్టి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెల‌వ‌డం కంటే, అవి వెనుక‌పెట్టి సేవాభావం ద్వారానే వారి మ‌న‌సులు గెల‌వ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని అమెరికాకు చెందిన‌ ప్ర‌గ‌తిశీల రాజ‌కీయ‌వేత్త‌, మేరీల్యాండ్‌లోని మాంట్‌గోమ‌రీ కౌంటీకి ఎగ్జిక్యూటివ్‌ మార్క్ ఎల్రిచ్ చెప్పారు. ఎవ‌రి భావజాలాన్నీ మార్చుకోవాల్సిన ప‌నిలేద‌ని, కానీ ప్ర‌జ‌ల ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో, సేవాభావంతో ప‌నిచేస్తే, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తే నాయ‌కుడిగా విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని అన్నారు. త‌ను అలాగే రాజ‌కీయాల్లో నిల‌బ‌డి గెలిచాన‌న్నారు. హైద‌రాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ”అమెరికాలో ప్ర‌గ‌తిశీల రాజ‌కీయాలు- భార‌తీయ స‌మాజానికి వ‌ర్తింపు” అనే అంశంపై ఎన్ఆర్ఐ నాగేంద‌ర్ మాధ‌వ‌రం అధ్య‌క్ష‌త‌న‌ ఆదివారం సాయంత్రం జ‌రిగిన స‌ద‌స్సులో ఎల్రిచ్‌ గౌర‌వ‌ అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

స్థానిక పాల‌న‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని, అంద‌రికీ అందుబాటులో ఇళ్లు, అంద‌రికీ విద్య‌, అంద‌రికీ ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి విధానాలు, పురుగు మందులు లేని పంట‌ల‌ను ప్రోత్స‌హించ‌డం వంటి పాల‌సీల ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో స్థానం సంపాదించాన‌న్నాను. త‌నపై అత్యంత ధ‌న‌వంతుడు పోటీ చేసినా, వాషింగ్ట‌న్ పోస్టు లాంటి బ‌ల‌మైన మీడియా త‌న‌పై రోజుకో నెగ‌టివ్ వార్త రాసినా ప్ర‌జ‌లు త‌న‌ను ఎన్నుకున్నార‌ని చెప్పారు. కొవిడ్ స‌మ‌యంలో తాను చేసిన సేవ‌లు త‌న‌కు విజ‌యాన్ని ఇచ్చాయ‌ని తెలిపారు. అత్యంత ధ‌న‌వంతుడిపై పోటీ చేస్తున్నా త‌న‌కు ఏనాడూ ఓట‌మి భ‌యం లేద‌ని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఇంట్లో హాయిగా బెడ్‌పై ప‌డుకున్న‌ప్పుడు ఇంత ప్ర‌శాంతంగా ఎలా ఉన్నావ‌ని ఒక‌రు అడిగితే.. ప్ర‌జ‌ల‌కు వారి త‌ర‌ఫున ప‌నిచేసే నాయ‌కుడు కావాల‌నుకుంటే త‌న‌ను ఎన్నుకుంటార‌ని, ఒక‌వేళ వారు త‌న‌ను వ‌ద్ద‌నుకుంటే హాయిగా విశ్రాంతి తీసుకుంటాన‌ని చెప్పిన‌ట్లు మార్క్ ఎల్రిచ్‌ గుర్తు చేశారు.

హ‌మాస్‌కు ఇజ్రాయెల్‌కు తేడాలేదు!

పాల‌స్తీనా- ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధంపై వేసిన ప్ర‌శ్న‌కు మార్క్ ఎల్రిచ్‌ స‌మాధానం చెబుతూ.. ఉగ్ర‌వాద సంస్థ హ‌మాస్ చేస్తున్నది త‌ప్పు అన్నారు. హ‌మాస్ చేసిన‌ త‌ప్పుల‌నే ఇజ్రాయెల్ పాల‌కులు కూడా చేస్తున్నార‌ని, ఇది స‌మ‌ర్థ‌నీయం కాద‌న్నారు. ప్ర‌తీకారానికి ప్ర‌తీకారం ఎప్ప‌టికీ ఫ‌లితాన్ని ఇవ్వ‌ద‌న్నారు. గాజాలో ప్ర‌జ‌ల ఇళ్ల‌లోకి వెళ్లి విధ్వంసం, ర‌క్త‌పాతం సృష్టించే అధికారం ఇజ్రాయెల్‌కు లేద‌న్నారు.

ఎల్రిచ్‌ విజ‌యం నియంత‌ల‌కు గుణ‌పాఠం: నాగేంద‌ర్ మాధ‌వ‌రం

పెట్టుబ‌డిదారులు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విరాళాలు తీసుకోకుండా ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచిన ఎల్రిచ్‌ విజ‌యం రాజ‌కీయ నియంత‌ల‌కు ఒక గుణ‌పాఠ‌మ‌ని ఎన్నారై నాగేంద‌ర్ మాధ‌వ‌రం అన్నారు. క‌మ్యూనిస్టు, చెగువేరా అభిమాని అయిన ఎల్రిచ్‌ అత్యంత ధ‌నికుల‌పై పోటీ చేసి ఎలా గెలిచార‌ని ఆశ్చ‌ర్య‌పోయాయ‌ని చెప్పారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన తీరు చూశాక భార‌త్‌లో కూడా ఈ త‌ర‌హా రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. భార‌త్‌లో వాట్స‌ప్ వేదిక‌గా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, ఇటీవ‌ల ఎర్ర‌కోట‌ను క‌ట్టింది మోదీ అన్న మెసేజ్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నారు. డ‌బ్బు, మ్యాన్‌ప‌వ‌ర్ లేకుండా ఢిల్లీలాంటి చోట్ల పార్టీలు అధికారం చేప‌ట్ట‌డం అభినంద‌నీయం అన్నారు.



 


శ్ర‌మ‌దోపిడీని గుర్తించ‌క‌పోతే మ‌ళ్లీ బానిస‌త్వ‌మే: క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి

అమెరికాలాంటి దేశాల్లో మార్క్ ఎల్రిచ్‌ లాంటి ప్ర‌గ‌తిశీల రాజ‌కీయ‌వేత్త‌లు విజ‌యం సాధిస్తుండ‌టం చాలా అభినంద‌నీయ‌మ‌ని సీనియ‌ర్ పాత్రికేయులు, స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం పూర్వ క‌మిష‌న‌ర్ క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. ఏ దేశంలో ఉన్నా వారి భావ‌జాలాన్ని వ‌దులుకోవాల్సిన ప‌నిలేద‌ని ఎరిక్ విజ‌యం స్ప‌ష్టం చేసింద‌ని చెప్పారు. ఏ భావ‌జాలం లేని ఒక ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలోకి ప్ర‌స్తుతం దేశం వెళుతున్న‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎలాన్ మ‌స్క్ రోజుకు 18 గంట‌లు ప‌నిచేయాల‌ని పిలుపునిస్తే, ఇంకో అంత‌ర్జాతీయ కంపెనీ చెప్పా పెట్ట‌కుండా ఉద్యోగుల‌ను ఇంటికి పంపించేసింద‌న్నారు. ఇటీవ‌ల ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి వారానికి 70 గంట‌లు ప‌నిచేయ‌మ‌న్నార‌ని ప్ర‌స్తావించారు. ఇవ‌న్నీ చూస్తుంటే షికాగో వీధుల్లో వీధిపోరాటాలు చేసి సాధించుకున్న రోజుకు 8 గంట‌ల ప‌ని హ‌క్కుల‌న్నీ ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. కార్మిక హ‌క్కుల‌ను చెరిపేసే దుర్మార్గ‌పు పాల‌న‌లోకి దేశాన్ని తీసుకెళ్లాల‌నుకుంటున్నార‌ని, మేల్కొని పోరాడ‌క‌పోతే మ‌ళ్లీ బానిస సంకెళ్లు త‌గిలించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

శ్ర‌మ‌ను దోచుకోవ‌డానికే ప‌నిగంట‌లు పెంచే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. ఈ స‌ద‌స్సులో మాట్లాడిన తెలంగాణ ఆమ్ అద్మీ పార్టీ క‌న్వీన‌ర్ సుధాక‌ర్ డిండి ఈదీ, సీబీఐని అస్త్రాలుగా చేసుకుని మోదీ ప్ర‌భుత్వం దేశంలో అరాచ‌కం సృష్టిస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ నాయ‌కుల‌పై ఇప్ప‌టివ‌ర‌కు 5 వేల‌కుపైచిలుకు కేసులు న‌మోదు చేసిన మోదీ ఏజెన్సీలు.. బీజేపీలో చేరిన 2000 మందిపై కేసులు కొట్టేయ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించారు. ఆప్ నేత‌ల‌ను అక్ర‌మ కేసుల్లో ఢిల్లీ జైల్లో నిర్బంధించార‌ని, వారు బీజేపీలో చేరుతామంటే వెంట‌నే విడుద‌ల‌వుతార‌న్నారు. ఎల్రిచ్‌ త‌ర‌హాలోనే ఆప్ పార్టీ భార‌త్‌లో ప్ర‌గ‌తిశీల రాజ‌కీయాలు చేస్తోంద‌న్నారు. ఈ స‌ద‌స్సులో ప్రొ. స‌త్య‌నారాయ‌ణ పాల్గొని ప్ర‌సంగించారు.