Site icon vidhaatha

సెగల గుమ్మంలో ఖమ్మం BRS.. కొత్తగూడెం, ఇల్లెందులోనూ అసమ్మతి స్వరాలు

విధాత, ఉమ్మడి ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాక దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. కొన్ని చోట్ల శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ బీఆర్‌ఎస్‌ అన్నట్టు తయారైంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అప్పుడు ఓటమి పాలైనవారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఇదే పార్టీలో అసమ్మతికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వారికి పొంగులేటి కూడా తోడవడంతో వచ్చే ఎన్నికల్లో అసమ్మతి ప్రభావం గట్టిగానే ఉంటుందన్న చర్చ నడుస్తున్నది. మరోవైపు పొంగులేటి ఏ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.

మున్సిపాలిటీలలో గందరగోళం

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో గందరగోళం నెలకొంది. పలు చోట్ల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నది. ఫలితంగా అసమ్మతి సెగ రగులుతూనే ఉన్నది. మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ అసంతృప్తవాదులు ఇప్పటి నుంచే తిరుగుబాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖమ్మం కార్పొరేషన్‌, మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ అసంతృప్తి సెగలు గక్కుతూనే ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కొత్తగూడెంలో పదనిసలు?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో గత రెండు సంవత్సరాల నుంచి అసంతృప్తి సెగలు ఉన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతోపాటు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జోక్యం చేసుకున్నప్పటికీ అసమ్మతి చల్లారలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 మంది వార్డు మెంబర్లు ఉన్నారు.

అందులో బీఆర్‌ఎస్‌కు 25, సీపీఐకి ఎనిమిది మంది ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు ఉండగా, ఒకరు కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్‌లో అసంతృప్త జ్వాలలు రేగాయి. కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతా లక్ష్మిపై 10 నుంచి 15 మంది వార్డ్ మెంబర్లు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. వీరంతా శ్రీనివాస్ రెడ్డి శిబిరానికి చెందినవారిగా ప్రచారం జరుగుతున్నది.

ఇల్లెందులో అంతా ఇంతా కాదు

ఇల్లెందు మున్సిపాలిటీలో అసమ్మతి సెగ మరో రేంజ్‌లో ఉన్నది. మహిళా కౌన్సిలర్లందరూ తిరుగుబాటు చేశారు. వారికి తోడు మరో నలుగురు కూడా చైర్మన్ వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి.

అంతకుముందు బీసీ సామాజిక నేత మడత వెంకట్ గౌడ్ ఇల్లెందులో బలమైన వ్యక్తిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుడిగా ముద్రపడ్డారు. తదనంతరం కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియ.. బీఆర్‌ఎస్‌లో చేరడంతో వర్గ పోరు మొదలైంది. ఫలితంగా మడత వెంకట్‌గౌడ్‌ను ఎమ్మెల్యే దూరం పెట్టారు.

దమ్మలపాటి వెంకటేశ్వరరావును తెరమీదకు తీసుకొచ్చి చైర్మన్‌గా గెలిపించారు. ఇల్లెందులో 24 వార్డులు ఉన్నాయి. అందులో 19 మంది బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. ముగ్గురు స్వతంత్రులు, ఒకరు సీపీఐ, మరొకరు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నుంచి గెలుపొందారు.

ప్రస్తుతం చైర్మన్‌పై 11 మంది తిరుగుబాటు లేవదీశారన్న చర్చ నడుస్తున్నది. ఈ అసమ్మతి వ్యవహారానికి ఒక ముగింపు పలకకపోతే జిల్లాలో రాబోయే ఎన్నిల్లో బీఆర్‌ఎస్‌ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

Exit mobile version