Site icon vidhaatha

Congress | చేతులు క‌లిపిన బ‌ద్ద‌శ‌త్రువులు.. తుమ్మ‌ల‌ను క‌లిసిన పొంగులేటి

Congress |

విధాత: రాజ‌కీయాల‌లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్ర‌లు ఎవ‌రూ ఉండ‌ర‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో భ‌ద్ద శ‌త్రువులుగా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిలు ఒక‌ట‌య్యారు. 2018 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో బీఆరెస్ ఘోరంగా ఓడిపోవ‌డానికి ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఉన్న వైర‌మే కార‌ణ‌మ‌న్న నెపంతో ఇద్ద‌రు నేత‌ల‌ను కేసీఆర్ దూరం పెట్టారు. దీనిని అవ‌మానంగా భావించిన ఈనేత‌లు త‌మ అనుచ‌రుల‌తో కాంగ్రెస్‌లో చేరారు. పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి కాంగ్రెస్‌లో చేర‌గా, అనుయాయుల కోరిక మేర‌కు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్ప‌టికే తుమ్మ‌ల‌ను రేవంత్‌రెడ్డి క‌లిసి పార్టీలోకి ఆహ్వానించారు.

తుమ్మ‌ల అధికారికంగా కాంగ్రెస్‌లో చేర‌డానికి అంతా సిద్ద‌మైంది. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇంటికి కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లి కలిశారు. ఇటీవలి దాకా ఇద్దరు బీఆరెస్ పార్టీలో ఉన్నప్పటికి వారు ఒకరికొకరు కలుసుకోలేదు. జిల్లా రాజ‌కీయాల్లో ఎడ‌మొఖం పెడ‌మొఖంగా ఉన్న ఈ ఇద్ద‌రు నేత‌లు సుధీర్ఘ కాలం త‌రువాత కలుసుకోవడం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాంగా నిలిచింది. శనివారం పొంగులేటి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనను కలిసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ తుమ్మల ఏ పార్టీలో ఉన్న ప్రజల మనిషని, ఆయనకు ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు., ఇప్పటికే తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. బీఆరెస్‌లో తుమ్మలకు స్థాయికి దగ్గ గౌరవం దక్కలేదని, నాలాగే ఆయన కూడా బీఆరెస్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కోన్నారన్నారు. పార్టీ నుంచి పొమ్మనలేకుండా మాకు పొగబెట్టారన్నారు. తుమ్మల రాకతో కాంగ్రెస్ మరింత బలోపేమవుతుందని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.

కాగా.. తాను తన అనుచరులు, మద్దతుదారులతో చర్చించి కాంగ్రెస్‌లో చేరానని, అలాగే తుమ్మల కూడా వారి అనుచరులు, మద్ధతుదారులతో చర్చించి కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని ప్రకటిస్తారన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ 40ఏళ్లుగా రాజకీయాల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల సంక్షేమం కోసం, జిల్లా అభివృద్ధి కోసం వినియోగించానన్నారు. పొంగులేటి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాన‌ని చెప్పారు.

తుమ్మల, పొంగులేటి, కమ్యూనిస్టుల దూరంతో ఖమ్మంలో బీఆరెస్‌కు ఎదురీత

తుమ్మల, పొంగులేటిలు బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్న నేపధ్యంలో ఆ జిల్లాలో రానున్న ఎన్నికల్లో బీఆరెస్‌కు ఎదురీత తప్పదంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. 2014,2018ఎన్నికల్లో బీఆరెస్ ఓక్కో సీటు చొప్పున గెలిచిన్పటికి ఓట్ల పరంగా బీఆరెస్‌కు ఈ దఫా భారీగానే గండిపడుతుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో తుమ్మల టీడీపీ నుంచి పోటీ చేశారు. 2015లో బీఆరెస్‌లో తుమ్మల చేరికతో గ్రామాల్లోని టీడీపీ కేడర్ పెద్ద సంఖ్యలో బీఆరెస్‌లో చేరింది. 2016పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల 40వేల ఓట్ల పైచిలుకు మెజార్తీతో గెలిచారు.

తర్వాతా 2018ఎన్నికల్లో తుమ్మల ఓడినప్పటికి బీఆరెస్‌కు జిల్లాలో ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో టీడీపీకి 4లక్షల 77,413ఓట్లు పడగా, బీఆరెస్‌కు 1లక్ష 55,850ఓట్లు పడ్డాయని, తుమ్మల బీఆరెస్‌లో చేరాకా 2018 ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో 6,74,430ఓట్లు పడ్డాయని ఇదే తుమ్మల బలానికి సంకేతమని తుమ్మల అనుచరులు చెబుతున్నారు.

ఇప్పుడు పొంగులేటితో పాటు తుమ్మల కూడా కాంగ్రెస్‌లోకి రానుండగా, వారి బలానికి తోడుగా బీఆరెస్‌కు వ్యతిరేకంగా జిల్లాలో నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న కమ్యూనిస్టు ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపవచ్చంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ దఫా ఎన్నికల్లో బీఆరెస్‌కు ఖమ్మం జిల్లాలో గడ్డుకాలం తప్పదన్న వాదన వినిపిస్తుంది.

Exit mobile version