Ponguleti Srinivas Reddy | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు ప్రసారమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించి, తన భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరే విషయంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇస్తానని తెలిపారు.
తన అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగానే ఏ పార్టీలో చేరాలనే విషయమై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి పార్టీ చేరిక తేదీలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఖమ్మం బహిరంగ సభ తేదీలనూ త్వరలోనే ప్రకటిస్తానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులతో పొంగులేటి సమావేశం నిర్వహించగా, వారంతా కాంగ్రెస్ పార్టీలోనే చేరాలనే పొంగులేటికి సూచించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో త్వరలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పొంగులేటితో పాటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఇతర నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.