విధాత: భారతీయుల దృష్టిలో రామాయణ మహాభారతాలు కేవలం గ్రంథాలు కావు.. అవి నిత్యజీవన విధానాలను నేర్పే సాధనాలు. సరైన నడవడిని ప్రజలకు నేర్పించే మహా అద్భుతాలు. భారతీయులకు.. మరీ ముఖ్యంగా తెలుగు వారికి రామాయణం అంటే ఆరో ప్రాణం.. వల్లమాలిన అభిమానం. తెలుగులో ఎన్నో ఏళ్లుగా రామాయణం వివిధ నటీనటులతో కథనాలతో రూపొంది అలరించింది. ఇక మన తెలుగు వారు రాముడిని రామయ్య అని, సీతను సీతమ్మని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. అలా భారతీయులకి రామయ్య తండ్రి, సీతాదేవిగా వారు మారిపోయారు. రామాయణాన్ని ఎన్నిసార్లు చదివినా.. ఎన్ని సార్లు వెండితెరపై చూసినా.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంటుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే మనవారికి సీతమ్మ దేవి అంటే అంజలీదేవి గుర్తుకు వస్తుంది.. అలాగే రామయ్య తండ్రి అంటే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. వారిద్దరూ కలిసి చేసిన ‘లవకుశ’ చిత్రం.. ఆనాడే ఎంతటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం ద్వారా హరినాధ్‌ను రాముడిగా.. గీతాంజలిని సీతగా చూపించారు.
ఆ తరువాత కొంతకాలానికి దిగ్గజ దర్శకుడు బాపు సంపూర్ణ రామాయణం వెండితెరకు అందించి, అందులో శ్రీరామునిగా శోభన్ బాబు, సీతాదేవిగా చంద్రకళను చూపించారు. మరెన్నో ఏళ్ల తర్వాత మరోసారి బాపు నందమూరి బాలకృష్ణను రాముడిగా.. నయనతారను సీతగా.. శ్రీరామరాజ్యం ద్వారా చూపించి అందరినీ అలరింపజేశాడు.
ఇక ప్రస్తుతం విషయానికి వస్తే.. త్వరలో పాన్ ఇండియా లెవెల్‌లో రామాయణం మీద రెండు చిత్రాలు రూపొందిస్తున్నారు. అందులో ఒకటి డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’. ఇందులో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతిసనన్ నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తూ ఉండడం విశేషం.
ఇదే సమయంలో మరో ఇద్దరు దర్శక నిర్మాతలు మరోసారి రామాయణం తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు ఈ చిత్రానికి ఓ ప్రాధాన్యత ఉంది. ఇందులో సీతమ్మ తల్లిగా.. దక్షిణాది నటి సాయి పల్లవి వురఫ్ భానుమతి నటిస్తోంది. గత రెండు మూడు రోజులుగా సీతగా సాయిపల్లవి అనే వార్త.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
‘ఫిదా’ చిత్రంతో భానుమతిగా అందరి మనసును దోచేసిన సాయిపల్లవి.. మొదటి నుంచి ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటోంది. ఈ కోయంబత్తూర్ చిన్నది ‘ఫిదా’ తర్వాత లవ్ స్టోరీ ‘శ్యామ్ సింగరాయ్’, ‘గార్గి’, ‘విరాటపర్వం’ ఇలా నటనకు ప్రాధన్యమున్న చిత్రాలను ఎన్నుకుంటూ ప్రతిభను చాటుకుంటుంది. అందాల ఆరబోతకు తావివ్వకుండా.. నిండైన వస్త్రధారణతో కేవలం హావభావాలు మోహ కవళికలు ద్వారా అన్ని వయసుల వారిని తనదైన నటనతో మెప్పిస్తోంది.
ఓ సాధారణ అమ్మాయిలా ముఖంపై మొటిమలు ఉన్నా.. అద్భుత నటనతో యూత్‌ను సైతం కట్టిపడేస్తోంది. ఇలా సెలక్టివ్‌గా చిత్రాలు ఎంచుకుంటున్న సాయిపల్లవి.. తన అందం అభినయాలతో బాలీవుడ్‌లోకి సీతాదేవి పాత్రతో అరంగేట్రం చేయనుండడం విశేషం.
వాస్తవానికి సీతాదేవి పాత్రకు మొదట దీపికా పదుకొనే, కరీనాకపూర్‌లను కూడా పరిశీలించి.. ఎట్టకేలకు సాయిపల్లవిని ఫైనలైజ్ చేశారనేలా టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో సీతాదేవిగా సాయిపల్లవి నటిస్తుండగా.. రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రావణాసరుడిగా స్టార్ హీరో హృతిక్ రోషన్‌లు నటించనున్నారని తెలుస్తోంది.