ముప్పేట దాడి.. పరేషాన్‌లో ప్రగతిభవన్..! లిక్కర్‌ కేసు, పేపర్ల లీకేజీ

కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా.. మారిన వరుస ఘటనలు కవిత లిక్కర్‌ కేసు.. ఈడీ కేవియట్ దాఖలు పేపర్ల లీకేజీ.. డెవర్షన్‌ పాలిటిక్స్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఓటమి స్వప్నలోక్‌ ఆగ్ని ప్రమాదం విధాత: సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కష్టాలన్నీ కట్టగట్టుకొని వచ్చినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, స్వప్న లోక్ మాల్ అగ్ని ప్రమాదం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం వంటి ప్రతికూల సంఘటనలన్నీ ఒకేసారి వచ్చిపడ్డాయి. వాటి ఆధారంగా […]

  • Publish Date - March 19, 2023 / 06:29 AM IST

  • కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా.. మారిన వరుస ఘటనలు
  • కవిత లిక్కర్‌ కేసు.. ఈడీ కేవియట్ దాఖలు
  • పేపర్ల లీకేజీ.. డెవర్షన్‌ పాలిటిక్స్‌
  • టీచర్స్‌ ఎమ్మెల్సీ ఓటమి
  • స్వప్నలోక్‌ ఆగ్ని ప్రమాదం

విధాత: సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కష్టాలన్నీ కట్టగట్టుకొని వచ్చినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, స్వప్న లోక్ మాల్ అగ్ని ప్రమాదం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం వంటి ప్రతికూల సంఘటనలన్నీ ఒకేసారి వచ్చిపడ్డాయి. వాటి ఆధారంగా విపక్షాలు ముకుమ్మడిగా ముప్పేట సాగిస్తున్న రాజకీయ దాడితో ప్రగతి భవన్ పరేషాన్ అవుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సహజంగానే లిక్కర్ స్కామ్ అస్త్రంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. స్కామ్‌లో కవిత ప్రమేయంపై మొదటి నుంచి ఆమెతో పాటు కేసీఆర్ కుటుంబం కప్పదాట్లు, పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది.

తాను ఏ తప్పు చేయలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఈడి, బోడి, మోడీలకు భయపడేది లేదన్న కవితా, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్‌లు ఆచరణలో అందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తున్నారు. ఒక మహిళను ఈడీ విచారించే పద్ధతి సరిగాలేదంటూ అకస్మాత్తుగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెనుక ఆమె చుట్టూ కేసు బిగిస్తుందన్న సందేహాలను బలపరుస్తున్నాయి.

ఈడీ కేవియట్ దాఖలు.. లిక్కర్ కేసులో మరో మలుపు

ఇప్పటికే ఈనెల 16న ఈడీ విచారణకు గైర్హాజరైన, కవిత 20వ తేదీన విచారణకు హాజరవుతుందా లేక 24వ తేదీన తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ పేరుతో మరోసారి ముఖం చాటేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కవిత కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఈడీ సైతం కేవియట్ దాఖలు చేయడం లిక్కర్ కేసును మరో మలుపు తిప్పింది.

లిక్కర్ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులు జైళ్లలో ఉండటం.. వారి విచారణ తుది దశకు రావడంతో కవితను, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని వారితో కలిపి విచారించి కేసును కొలిక్కి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈడి ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న కవిత విచారణకు రాకుంటే ఆమెను అరెస్ట్ చేయవచ్చన్న వాదన వినిపిస్తుంది.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టి తాము బలపడాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ ఈడీ, సీబీఐల ద్వారా కవితను లిక్కర్ కేసులో లాక్ చేయాలని చూస్తుంది. అయితే రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐల కేసులకు తమకు సంబంధం లేదంటూనే బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా పరోక్షంగా రాజ్యాంగ పరంగా వీలైనంతవరకు కవిత కేసును ఆశించిన దిశగా ముందుకు నడిపిస్తుంది.

గోరుచుట్టుపై రోకటి పోటులా.. పేపర్ల లీకేజీ

ఇదే సమయంలో ఇప్పటికే కవిత లిక్కర్ కేసు నుంచి ఎలా బయటపడాలన్న దానిపై అపసోపలు పడుతున్న కేసిఆర్ కుటుంబానికి టీఎస్పీఎస్సీ పేపర్‌ల లీకేజీ వ్యవహారం గోరుచుట్టుపై రోకటి పోటులా వచ్చి పడింది. పేపర్ల లీకేజీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు టార్గెట్ గా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం వారికి మరింత సమస్యాత్మకంగా తయారైంది.

లీకేజీ వ్యవహారంలో నాలుగు పరీక్షలు రద్దుచేసి, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికి నిరుద్యోగుల్లో ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు ఆగడం లేదు. ఒకవైపు బీజేపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీఎస్పీ నుంచి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకోవైపు వైఎస్ఆర్టీపీ షర్మిల, టీజేఎస్ కోదండరామ్‌లకు తోడు విద్యార్థి సంఘాలు పేపర్ల లీకేజీపై రాజకీయ మంటలు రగిలిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన సెగలు భగ్గుమంటున్నాయి.

కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా..

కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారిన పేపర్ల లీకేజీ ఇద్దరు వ్యక్తుల తప్పుడు పని మాత్రమేనని, మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం.. నన్ను రాజీనామా చేయమనడం ఎంతవరకు సమంజసమని, లీకేజీకి నాకు ఏమి సంబంధం అంటూ కేటీఆర్ చిందులు తొక్కడం ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోస్తుంది.

ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ టీఎస్పీఎస్సీకి సాంకేతిక మద్దతునిచ్చి పరీక్షలు సజావుగా నిర్వహించాలని చూడడంలో విఫలమయ్యారని, లీకేజీ నిందితులు పేపర్లను బిఆర్ఎస్ వారి కోసమే లీక్ చేశారని, లీక్ లో కేటీఆర్ పీఏ ఉన్నారని, లీకేజీ వెనక కేటీఆర్, కవిత, హరీష్ రావుల ప్రమేయం ఉందంటూ బండి, రేవంత్, ప్రవీణ్ కుమార్ లు ఆరోపిస్తున్నారు.

దీంతో పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక అంశంగా మారింది. పేపర్ లీకేజీ ఇద్దరు వ్యక్తుల పనిగా చూడాలని.. నాకు సంబంధం లేదన్న కేటీఆర్ గడుసు వాఖ్యలను విపక్షాలు మరోలా చూస్తున్నాయి. పేపర్ లీకేజీతో నీకు సంబంధం లేకపోతే లిక్కర్ కేసులో కవిత ఇరుక్కుంటే తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, మహిళలకు ఏం సంబంధం అని, వారికి ఎట్లా అవమానమని కేటీఆర్‌ను నిలదీస్తున్నాయి.

టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ అయినా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుందా..? అలాగైతే ఆ సంస్థ ఇచ్చే ఉద్యోగాలను తామే ఇచ్చామని ప్రభుత్వం ఎందుకు చెప్పుకుంటుందన్న ప్రశ్నలు కేటీఆర్‌కు తెలియనివి కాదని ఎద్దేవా చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ ఎట్లనో.. కవిత కేసు విచారిస్తున్న ఈడీ, సీబీఐలు కూడా స్వతంత్ర రాజ్యాంగ సంస్థలే కదా అని బీజేపీ గుర్తు చేస్తుంది.

డైవర్షన్ పాలిటిక్స్‌..

ఇక కవిత విచారణ ఘట్టం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను రెండు రోజులు ఆలస్యంగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్ నిరసనలకు వాడుకున్న ప్రభుత్వం.. పేపర్ల లీకేజీలో తప్పును నిందితుల్లో ఒకరు బీజేపీకి చెందిన వాడని, లీక్ వెనుక ఉద్యోగ నోటిఫికేషన్ ఓర్వలేని విపక్షాల కుట్ర ఉండవచ్చని అంటూ కేటీఆర్ మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మాటలే అందుకున్నారు.

పేపర్ల లీకేజీలో రాజకీయ కుట్ర కోణం ఉంటే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదే ఉన్నందునా వారి ఆధీనంలోని సిట్‌ను విచారణకు వాడుకునే వెసులుబాటు ఉండనే ఉందని, అలాంటప్పుడు రాజకీయ కుట్ర కోణం అంటూ కేటీఆర్ బడాయి మాటలతో పేపర్ లీకేజీ వ్యవహారం నుంచి ప్రజల, నిరుద్యోగుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించడం ఎందుకని విపక్షాలు వాదిస్తున్నాయి.

కేటీఆర్ మాటలు పేపర్ లీకేజీ కేసును తక్కువ చేసి, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విపక్షాల వాదనకు ఊతమిచ్చాయి. లీకేజీ కేసులో ఒక నిందితురాలి తల్లి బీఆర్ఎస్ సర్పంచ్‌గా, సోదరుడు ఆ పార్టీ నాయకుడిగా ఉన్న విషయం మాత్రం కేటీఆర్ ఈ సంధర్భంగా మరిచిపోయారనుకోవడం అతిశయోక్తి అనుకోవచ్చు.

లీకేజీ వ్యవహారాన్ని ఇద్దరి వ్యక్తుల తప్పుగా కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల బాధగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తుండడం గమనార్హం. అదిగాక పేపర్ల లీకేజీలో తానేందుకు రాజీనామ చేయాలన్న కేటీఆర్.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకేజీలపై ఎందుకు రాజీనామాలు చేయలేదంటూ ప్రశ్నించడం, టిఎస్పీఎస్ బోర్డును వెనుకేసుకురావడం సరైనదా కాదా అన్న చర్చను రగిలించింది.

ఎదురు దాడి రాజకీయాలు..

మెడికల్ కాలేజీల వివాదంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం పతనమవ్వడం.. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ స్కామ్‌లో, స్టాంపుల స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కృష్ణ యాదవ్‌లు తదనంతర కాలంలో పదవులకు దూరమైన వైనం, మరి ముఖ్యంగా రైలు పడిపోతే రాజీనామా చేసిన లాల్ బహుదూర్ శాస్త్రి వంటి ఉదంతాలను.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు రాజయ్య, ఈటెల రాజేందర్‌లను సాగ నంపిన ఘటనలను మాత్రం కేటీఆర్ యాదిలోకి తీసుకోకపోవడం ఆయన ఎదురు దాడి రాజకీయాలను చాటింది.

ఏది ఏమైనా పేపర్ల లీకేజీ వ్యవహారం లిక్కర్ స్కామ్‌లు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో విపక్షాలకు బలమైన ఆయుధాలుగానే అందగా దేశమంతా విస్తరించాలనుకుంటున్న బీఆర్ఎస్‌కు ఇంటిపోరుగా మారి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న పరిస్థితులను సృష్టించాయి.

చేతులు కాలాక.. ఆకులు పట్టకుంటున్న కాంగ్రెస్‌

లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీ స్కామ్ నడుస్తున్న క్రమంలోనే రంగారెడ్డి- హైదరాబాద్-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం బీఆర్ఎస్‌కు రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులను కల్పించింది. బీజేపీ పార్టీ మద్దతునిచ్చిన ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడం వెనుక ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై అంతర్లీనంగా దాగిన వ్యతిరేకతను చాటాయన్న విషయాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేని అంశంగానే చెప్పవచ్చు.

గెలిచిన ఏవిఎన్ రెడ్డి ముందుగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయాలని ఆ పార్టీ నాయకత్వంతో సంప్రదించగా, వారిలో వర్గ పోరు నేపథ్యంలో ఆయన ప్రతిపాదనకు మొండి చేయి ఎదురయింది. దీంతో బీజేపీని ఆశ్రయించి ఆయన గెలుపొందారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా అరే.. మంచి విజయావకాశం చేజార్చుకున్నామంటు హస్తం పార్టీ నాయకత్వం మధనపడుతుంది.

రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఎదురైన లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీ సమస్యలు చాలావన్నట్లుగా స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతీ యువకులు చనిపోవడం ప్రభుత్వ పనితీరును ప్రజల్లో మరింత పలచన చేసింది. వారిని రక్షించడంలో ప్రభుత్వ శాఖలు వైఫల్యం చెందాయన్న విమర్శల నేపథ్యంతో పాటు ఇటీవల తరచూ జంట నగరాల్లో తలెత్తుతున్న అగ్ని ప్రమాదాలు ప్రభుత్వ ప్రతిష్టను మసక బారిస్తున్నాయి.

Latest News