Site icon vidhaatha

Pregnant Man | 36 ఏండ్లుగా అత‌ను గ‌ర్భ‌వ‌తుడు..! శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందితో వెలుగులోకి..

Pregnant Man | ఇది చాలా అరుదైన కేసు.. 36 ఏండ్లుగా త‌న క‌వ‌ల సోద‌రుడి పిండం ఓ వ్య‌క్తి క‌డుపులో ఉండిపోయింది. క‌డుపు భారీగా పెరిగిపోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డటంతో.. వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా ఈ విష‌యం వెలుగు చూసింది.

ది డైలీ స్టార్ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. నాగ్‌పూర్‌కు చెందిన సంజు భ‌గ‌త్‌ 1963లో జ‌న్మించాడు. 20 ఏండ్ల వ‌య‌సులో అత‌ని క‌డుపు క్ర‌మ‌క్ర‌మంగా పెరిగింది. అయిన‌ప్ప‌టికీ సంజు కూలీ ప‌నులు చేసుకునేవాడు. ఇక తోటి వారు కూడా అత‌న్ని గ‌ర్భ‌వ‌తుడు అని ఆట‌ప‌ట్టించేవారు.

అలాంటివేమీ ప‌ట్టించుకునేవాడు కాదు సంజు. 30 ఏండ్ల వ‌య‌సులో సంజు క‌డుపు మ‌రింత పెరిగింది. నిజానికి ప్రెగ్నెంట్ వుమెన్ మాదిరి అత‌ని క‌డుపు పెరిగింది. 36 ఏండ్ల వ‌యసులో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డాడు. ప‌ని చేసుకునేందుకు చేత‌కాలేదు.

దీంతో 1999లో ముంబైలోని ఓ ఆస్ప‌త్రి వైద్యుల‌ను సంజు సంప్ర‌దించాడు. మొద‌ట స్కానింగ్ నిర్వ‌హించిన వైద్యులు క‌ణితి అని భావించారు. ఇక ఆ ట్యూమ‌ర్‌ను తొల‌గించేందుకు వైద్యులు శ‌స్త్ర చికిత్స చేయ‌డం ప్రారంభించారు. సంజు కడుపు కోసిన త‌ర్వాత డాక్ట‌ర్లు షాక్ అయ్యారు.

అత‌ని క‌డుపులో క‌ణితి లేదు. మాన‌వ శ‌రీరం బ‌య‌ట‌ప‌డింది. అవ‌య‌వాలు, వెంట్రుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో డాక్ట‌ర్ల చేతులు వ‌ణికిపోయాయి. మొత్తానికి సంజు క‌డుపులో చ‌నిపోయి ఉన్న శిశువు మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. సంజు భ‌గ‌త్‌కు ఇప్పుడు 60 ఏండ్లు కాగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్ప‌టికీ అత‌న్ని ప్రెగ్నెంట్ మ్యాన్ అని ఆట‌ప‌ట్టిస్తూనే ఉంటారు.

పిండంలో పిండం కార‌ణంగానే..?

పిండంలో పిండం కార‌ణంగానే ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తాయ‌ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీన్ని వైద్య ప‌రిభాష‌లో ఫీట‌స్ ఇన్ ఫీటు అని అంటార‌ని తెలిపారు. ఒక వైక‌ల్య స‌క‌శేరుక పిండం త‌న క‌వ‌ల సోద‌రుడి దేహంలో ఉండిపోయింద‌ని వెల్ల‌డించారు. ఇలాంటి కేసులు చాలా అరుదు అని పేర్కొన్నారు.

Exit mobile version