విధాత, మునుగోడు: మునుగోడులో జయకేతనం ఎగురవేయడానికి ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. అధికార పార్టీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నది. విపక్షాలు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తమకు అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో చేయబోయే పనుల గురించి వివరిస్తున్నాయి. ప్రచారం ఉధృతమౌతున్న సమయంలో పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.
మునుగోడు ఉప ఎన్నిక కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం సహా ప్రవర్తనా నియమావళి పక్కా అమలు చేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అవసరమైన ఈవీఎం, వీవీప్యాట్లు సిద్ధంగా ఉన్నాయని, ఎక్కువమంది ఇంజినీర్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సీఈవో వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నట్లు చెప్పారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
మరోవైపు పైసల పంపిణీ
సార్వత్రిక ఎన్నికలకు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్వశక్తులు ఒడ్డుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తునే ప్రలోభ పరుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గానికి కోట్ల రూపాయలు తరలి వస్తున్నాయి. గట్టి నిఘా ఉన్నప్పటికీ గ్రామాలకు చేరవేస్తున్నట్లు సమాచారం.
ఉప ఎన్నికకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం ఊపందుకున్నది. దీంతో పాటు నియోజకవర్గంలో డబ్బు ప్రవాహం మొదలైంది. క్షేత్రస్థాయిలో నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటిదాకా ప్రయత్నించిన పార్టీలు నేరుగా ఓటర్లకే డబ్బులు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వివిధ గ్రామాలకు డబ్బులు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా బీజేపీకి చెందిన రూ. కోటి నగదు పట్టుబడింది. పొలీసులు నగదును స్వాదీనం చేసుకొని సదరు వ్యక్తిని విచారించగా కరీంనగర్‌కి చెందిన 13 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ భర్త సోప్పరి వేణు తండ్రి రాజమౌళి, వయస్సు 48 తెలిపిన వివరాల ప్రకారం బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన రాము నుంచి ఈ నగదును తీసుకొస్తూ పట్టుబడ్డారు. తదుపరి విచారణ కొరకు income tax nodal ఆఫీసర్స్‌కి సమాచారం ఇచ్చారు.