చండీగఢ్: బంధువు ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి దాడి చేసిన పదిహేనేండ్ల క్రితం నాటి కేసులో పంజాబ్ మంత్రి అమన్ అరోరాతోపాటు మరో ఎనిమిది మందికి గురువారం సంగ్రూర్ జిల్లా కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. మంత్రిపై ఆయన బావ రాజిందర్ దీప తన ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి గాయపర్చాడని 2008లో ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని అనేక సెక్షన్ల కింద తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరిపారు.
నిందితులపై నేరాన్నిసాక్ష్యాధారాలతోసహా ప్రాసిక్యూషన్ నిరూపించడంతో సబ్-డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సునమ్ గుర్భిందర్ సింగ్ జోహల్ కోర్టు అమన్ అరోరాతోపాటు మరో ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది. వీరికి ఐపీసీ సెక్షన్ 452 కింద రెండేండ్ల జైలు, ఐపీసీ సెక్షన్ 323 కింద ఏడాది జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వారికి 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు శిక్షను వాయిదా వేసింది.
ప్రస్తుతం అమన్ అరోరా.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంత్రివర్గంలో పునరుత్పాదక ఇంధనం, ప్రింటింగ్, స్టేషనరీ, ఉపాధి కల్పన, శిక్షణ పాలన సంస్కరణల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దోషిగా తేలిన తర్వాత అమన్ అరోరా సంగ్రూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని చెప్పారు. 2012లో తనకు, దీపకు మధ్య రాజీ కుదిరిందని, అయితే తన బావ తన ఒప్పందాన్ని తుంగలో తొక్కాడని తెలిపారు.