విధాత : ఇక ఖైదీలు జైళ్లలోనే తమ భాగస్వాములతో ఏకాంతంగా గడపొచ్చు. మూడు నెలలకు ఒకసారి రెండు గంటల చొప్పున దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వారికి ఎలాంటి అంతరాయం కలగకుండా, జైలు ఆవరణలోనే అటాచ్డ్ బాత్రూంతో ఉన్న గదిని కూడా ఏర్పాటు చేశారు. మరి జైళ్లల్లోనే ఖైదీలకు తమ పార్ట్‌నర్స్‌తో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పించింది ఎక్కడో కాదు. మన దేశంలోని పంజాబ్ జైళ్లల్లోనే. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఈ అవకాశం కల్పిస్తూ పంజాబ్ జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ కార్యక్రమానికి పంజాబ్ జైళ్ల శాఖ మంగళవారం శ్రీకారం చుట్టింది. మొదటగా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు, న్యూ డిస్ట్రిక్ట్ జైలు, భటిండాలోని వుమెన్ జైలులో ఈ అవకాశం కల్పించారు. దీర్ఘకాలంగా జైల్లో గడుపుతున్న ఖైదీలకు మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి రోజు 21 జంటలు ఏకాంతంగా గడిపాయి. వుమెన్ జైలులో 4 జంటలు, న్యూ డిస్ట్రిక్ట్ జైల్లో 5, గోయింద్వాల్ సాహిబ్ జైల్లో 12 జంటలు తమ దాంపత్య జీవితంలో మునిగి తేలాయి. ఇలా మూడు నెలలకు ఒకసారి రెండు గంటల చొప్పున అవకాశం కల్పిస్తామని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. అయితే కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లు, తీవ్రవాదులు, హెచ్‌ఐవి వంటి తీవ్రమైన అంటు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏకాంతంగా గడిపే అవకాశం కల్పించలేదు.