విధాత: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు ఇటీవల కుంగిన నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బయలుదేరారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వడంతో గురువారం ఉదయమే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు పయనమయ్యారు.. ఆయన వెంట టీపీపీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారు.
బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించినప్పటికీ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో రాహుల్ గాంధీ ఉదయమే బయలుదేరి వెళ్లారు. మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు పోలీసులు అనుమతిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ బరాజ్‌ను గోదావరి నదిపై బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అయితే, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ బరాజ్‌లోని ఓ పిల్లర్‌కు గత నెల 21న పగుళ్లు ఏర్పడ్డాయి. బరాజ్ కొంత మేర కుంగినట్టు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
బుధవారం రాహుల్‌గాంధీ కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు పారుతుంటే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల భారీ వ్యయంతో కట్టిన ప్రాజెక్టులు ఒక్కోటి కూలిపోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. నాగార్జునసాగర్, ప్రియదర్శిని జూరాల, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయని, ఏ సమస్యా లేకుండా అవి నేటికీ పటిష్ఠంగా ఉన్నాయని రాహుల్ గుర్తు చేశారు.
కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పుచేసి ప్రాజెక్టులు కడితే అవి చూస్తుండగానే కొట్టుకుపోతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. అందులో భాగంగా గురువారం ఉదయం మేడగడ్డ బరాజ్ సందర్శనకు బయలుదేరి వెళ్లారు.