విధాత: మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. అంతకు ముందు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.
మునుగోడు ఎన్నిక రాష్ట్ర, దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 10న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. మునుగోడులో బీజేపీ గెలిచిన నెల రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్ని నవంబర్ 3వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో దిగనుండగా.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే మునుగోడులో విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్.. అన్ని విధాలుగా సిద్దమయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టేలా ప్రయత్నాలు ప్రారంభించాయి.