Site icon vidhaatha

Rajbhavan and Telangan Govt War । రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతున్నదా?

Rajbhavan and Telangan Govt War । రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన ఎనిమిది బిల్లులను గవర్నర్‌ (Governor) పెండింగ్‌లో పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం.. చర్చలకు పిలిచినా రాష్ట్ర ప్రభుత్వం రావటం లేదని గవర్నర్‌ ఎదురు దాడి! తాజాగా ఏకంగా సుప్రీం కోర్టు (Supreme Court) లోనే ప్రభుత్వం దావా వేయడం, దానిపై గవర్నర్‌ తీవ్రంగా ప్రతిస్పందించడంతో ఈ వ్యవహారం ముదురుపాకాన పడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వ్యవస్థల అవాంఛిత ఘర్షణ మధ్య ప్రజలకు ఉపయోగపడే అంశాలపై బిల్లలు మూలుగుతున్నాయనే వాదన వినిపిస్తున్నది.

విధాత: దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు గవర్నర్‌ (Governor) వ్యవస్థను భ్రష్టుపట్టించాయనేది కాదనలేని సత్యం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు గవర్నర్‌ వ్యవస్థను వాడుకున్న ఉదంతాలు అనేకం. తెలంగాణ (Telangana) లోనూ ఈ వివాదం కొన్నేళ్లుగా నడుస్తున్నది. అయితే.. తాజా పరిణామాలతో ఇది మరింత ముదిరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పెండింగ్‌లో పది బిల్లులు

అసెంబ్లీ, మండలిలో పాస్‌ చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. ఇందులో గత ఐదు నెలలుగా ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. తాజాగా మరో మూడు జత చేరాయని పేర్కొంటున్నది. వీటికి ఆమోద ముద్ర వేయకుండా, కనీసం అభిప్రాయం కూడా చెప్పకుండా గవర్నర్‌ వాటిని తొక్కిపట్టారనేది తెలంగాణ ప్రభుత్వం (Telangan State Government)విమర్శ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించడం, తెలంగాణ ప్రభుత్వ చర్యపై గవర్నర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గవర్నర్‌ వాదన మాత్రం వేరేలా ఉన్నది. తనకు కనీస మర్యాద ఇవ్వటం లేదని, ప్రొటోకాల్‌ కూడా పాటించడం లేదని ట్విట్టర్‌లో సీఎస్‌ శాంతికుమారి (CS Shantikumari) పై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళిసై (Governor Tamilisai).. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌భవన్‌కు మర్యాదపూర్వకంగా వచ్చి తనను కలిసేందుకు తీరిక లేకుండా పోయిందా? అని సీరియస్‌ కామెంట్‌ చేశారు. చర్చలతో పరిష్కారాలు దొరుకుతాయన్న గవర్నర్‌.. ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ చాలా దగ్గరగా ఉంటుందంటూ సీఎస్‌కు చురక వేశారు.

ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరన్న గవర్నర్‌

వాస్తవానికి ఇటీవల అసెంబ్లీ సమావేశాలు, అంతకు ముందు రిపబ్లిక్‌ డే పరేడ్‌ విషయంలో వివాదం రేగింది. అయితే.. మొత్తానికి గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget session) ప్రారంభించేందుకు ప్రభుత్వం ఒప్పకోవడంతో ఇకపై అంతా సవ్యంగానే నడుస్తుందని అందరూ భావించారు. కానీ.. గవర్నర్‌ మాత్రం బిల్లులను ఆమోదించే విషయంలో తాత్సారం చేస్తూనే ఉండటం గమనార్హం. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ నాయకత్వం విమర్శిస్తుంటే.. తాను పిలిచినా అధికార యంత్రాంగం రావటం లేదని గవర్నర్‌ ఎదురు దాడి చేస్తున్నారు. రాజ్‌భవన్‌ ఢిల్లీ కంటే దగ్గర ఉన్నదని సీఎస్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి సమయం లేదా? అధికారికంగా రాలేదు, ప్రోటోకాల్‌ లేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్‌ కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడుతాయి. అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

గవర్నర్‌ ముందు నాలుగు మార్గాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్‌ చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపినప్పుడు ఆ బిల్లుకు ఆమోద మద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలన కోసం తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపడం అనే నాలుగు మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించాలి. కానీ గవర్నర్‌ ఈ నాలుగింటిలో ఏదీ చేయకుండా నెలల తరబడి బిల్లులను పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా? వాటిపై ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా తన దగ్గరే ఉంచుకోవడం రాజ్యాంగబద్ధమేనా? అని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసిన బిల్లలును గవర్నర్‌ ఆమోదించాలని రాజ్యాంగం (Constitution of India) చెబుతున్నది కానీ.. ఆమోదించడానికి ఎంత కాలం తీసుకోవాలి? అనే అంశం నిర్దిష్టంగా లేదు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు దీనిని సావకాశంగా చేసుకుంటున్నారనే విమర్శ ఉన్నది. తెలంగాణలో జరుగుతున్నదీ అదేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో శుక్రవారం జరిగే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

పంజాబ్‌ కేసులో సుప్రీం ఏమన్నది?

ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వం (Punjab Government) కూడా గవర్నర్‌పై సుప్రీం కోర్టుకెక్కింది. తెలంగాణ కేసుకు, పంజాబ్‌ కేసుకు పోలిక లేకపోయినప్పటికీ.. గవర్నర్‌ వ్యవస్థ, ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనే అంశంపై సుప్రీం కోర్టు స్పష్టంగానే చెప్పింది. అసెంబ్లీని సమావేశపర్చేందుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడం లేదని పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదోపవాదాలు విన్న సుప్రీం కోర్టు ఇరు పక్షాలు ‘పరిణతి చెందిన రాజనీతిజ్ఞత’ను ప్రదర్శించాలని గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి సూచించింది. అంతేకాకుండా ప్రమాణాలు దిగజారే విషయంలో పోటీ పడవద్దని కూడా హితవు చెప్పింది. గవర్నర్‌, ప్రభుత్వం మధ్య పరస్పర నిందారోపణలు రాజ్యాంగ విలువలను ప్రమాదంలో పడేస్తాయని కూడా పేర్కొన్నది. రెండు రాజ్యంగ సంస్థల మధ్య సుహృద్భావ వాతావరణంలో పరిణతి చెందిన రాజనీతిజ్ఞత (statesmanship)తో చర్చలు జరుగాలని సూచించింది. వీటితోపాటే ఒక ముఖ్యమైన సూచన కూడా సుప్రీం కోర్టు చేసింది. ‘పరిపాలనకు సంబంధించి గవర్నర్‌ ఏదైనా సమాచారం అడిగినప్పుడు దానిని అందించడం ప్రభుత్వం బాధ్యత. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని క్యాబినెట్‌ నిర్ణయించినప్పుడు దానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందే’నని పేర్కొన్నది. మరి తాజా కేసులో సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇవ్వనున్నదో!

Exit mobile version