విధాత, హైదరాబాద్: బీజేపీ మాజీ నాయకుడు రాపోలు ఆనందభాస్కర్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాపోలు వెంట పలువురు పద్మశాలీ సంఘం నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాపోలు ఆనందభాస్కర్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.
రాపోలు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త అని కొనియాడారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ పలు పథాకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని ఆయన పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దేశంలో చాలామంది అద్భుత ప్రతిభ ఉన్న చేనేత కళాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు.
నేతన్నకు బీమాతో కార్మికులకు అండగా ఉంటున్నామని, చేనేత కళాకారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. అనంతరం.. రాపోలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు అని పొగిడారు. తెలంగాణ భూగర్భాన్ని నదీజల గర్భంగా మార్చిన భగీరథుడు అని కొనియాడారు.
తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS గారి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/j9dtu9Tvez
— TRS Party (@trspartyonline) October 26, 2022
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకువెళ్తున్నదన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చి అమలుచేస్తున్నారని ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా తనపై అప్యాయత, అనురాగాలు చూపిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరుల ప్రోత్సాహంతో తాను ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించానని రాపోలు చెప్పారు.