Site icon vidhaatha

రష్మికకు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుంది

విధాత‌: కన్నడ కస్తూరి రష్మికా మందన్నా గత కొంతకాలంగా విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. కన్నడలో దర్శక నటుడు రక్షిత్ శెట్టి‌తో ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత ఆమె వివాహాన్ని రద్దు చేసుకుంది. దానికి కారణం తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు రావడమే. ఆమె నటిస్తున్న చిత్రాలన్నీ బాగా ఆడుతూ ఉండటం.. రష్మికకు టాలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ రావడంతో ఆమె తన కెరీర్ కోసం రక్షిత్ శెట్టి‌ని మోసం చేసిందని కన్నడిగులు మండిపడ్డారు.

ఆ తర్వాత ఆమె ఇటీవల ‘కాంతార’ చిత్రం ఇంకా చూడలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కన్నడ సంప్రదాయాలు, సంస్కృతులకు అద్దం పట్టేలా తెరకెక్కిన ఈ అద్భుతమైన చిత్రాన్ని చూడలేదని వ్యాఖ్యానించడం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో నెటిజన్లు ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ చేశారు.

ఆ తర్వాత ఈమె ఒక అండర్ వేర్ యాడ్‌లో నటించింది. ఆ తర్వాత ఓ లిక్కర్ కంపెనీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లో కనిపించడంతో ఆమెపై నెటిజన్లు దొరికిందే సందు అని విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఆమెకు అండగా నిలబడింది ఒక్క కిచ్చా సుదీప్ మాత్రమే.

తాజాగా రష్మికా మందన్నా తనపై వస్తున్న ట్రోలింగ్‌పై వివరణ ఇచ్చింది. సెలబ్రిటీ లైఫ్‌లో ఇవన్నీ చాలా కామన్ అని అర్థం చేసుకున్నాను. నేను అందరికీ నచ్చాలని లేదు కదా…! నటీనటులందరూ ఎల్లకాలం మనల్ని అభిమానిస్తూ ఉండాలని కోరుకోకూడదు. అలాగే మనకు అభిమానులు ఉన్నట్లే వ్యతిరేకులు కూడా ఉంటారు.

జీవితంలో ప్రేమ, ద్వేషం ఎలాగో సెలబ్రిటీ రంగంలో మంచి చెడులు అలాగే. మనల్ని ప్రేమించే వారు ద్వేషించేవారు అందరి కంటే ఈ రంగంలో ఎక్కువగా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో అందరి దృష్టి మన మీదనే ఉంటుంది. మేము నటీనటులుగా ఎన్నో ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొంటాం.

అందరితోనూ మాట్లాడతాం. వాటిపై కొందరు విమర్శలు చేస్తారు. కొందరు ప్రశంసిస్తారు.. ఇవన్నీ కామన్ అని అర్థం చేసుకున్నాను. ఇక నా పద్ధతి, నేను మాట్లాడే విధానం, నా వ్యవహారశైలి కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే వారు నా గురించి ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోలింగ్ విషయాన్ని పక్కన పెడితే నేను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాను. అందుకు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది.

కాగా ఇటీవల కిచ్చా సుదీప్ కూడా రష్మికా మందన్నా విషయం గురించి మాట్లాడుతూ.. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇలాంటివి తప్పదు. వీటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. నీకు ఆ సామర్ధ్యం ఉంది. సెలబ్రిటీలు అన్న తర్వాత పూలమాలలు మాత్ర‌మే కాదు.. గుడ్లు, టమాటాలు కూడా మీద పడతాయి. వాటికి కూడా మనం సిద్దపడి ఉండాలి అని హితబోధ చేశాడు. మొత్తానికి అది రష్మికపై మంచి ప్రభావం చూపించి ఆమెకు ఒక గైడ్‌లాగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు.

Exit mobile version