Ration cards | Telangana
కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోండి జారీ చేస్తాం.
– పలు సందర్భాల్లో పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు
దరఖాస్తు కొన్న వారికి జూన్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేస్తాం.
-గత నెలలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
-తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటన
విధాత: రేషన్‌కార్డుల (Ration cards) జారీపై మంత్రుల నుంచి వెలువడిన మొదటి రెండు ప్రకటనలు చూసిన లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చేసిన ప్రకటనతో ఆశలు అడియాశలయ్యాయి. ఇక ఈ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల జారీ హుళ్లక్కేనా అనే పరిస్థితి దాపురించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తొలి ఐదేండ్లలో ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా జారీచేయలేదు.
2018 ఎన్నికలకు ముందు మాత్రం కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు కోరింది. సుమారు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2021 సంవత్సరం వరకు పలు విడతల్లో 3.11 లక్షల మందికి రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.
ఆ తర్వాత నుంచి కొత్త కార్డుల జారీని బంద్‌చేసింది. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. రేషన్ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును తొలగిస్తున్న అధికారులు, కొత్తగా జన్మించిన వారి పేర్లను మాత్రం చేర్చడం లేదు. ఈ మార్పులు చేర్పుల కోసం ఎఫ్ఎస్సీఆర్ఎం వెబ్సైట్లో చేసుకుంటున్న దరఖాస్తుకే ఇప్పటివరకు మోక్షం కలగలేదు.
రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు ఇలా..
తెలంగాణ ప్రభుత్వ కార్డుల్లో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద లబ్ధిదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. మిగతా రేషన్ కార్డులవారికి ప్రతీనెలా 6 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.