RBI | త్వరలో బ్యాంకుల్లో ఖాతాదారులకు మరింత సులభతరమైన సేవలు అందనున్నాయి. కేవైసీని అప్‌డేట్ చేయనందుకు బ్యాంకులు ఖాతాలను మూసివేయొద్దని ఆర్‌బీఐ నియమించిన ప్యానెల్ కమిటీ సిఫారసు చేసింది. అలాగే ఖాతాదారులు మరణిస్తే వారసులు ఆన్‌లైన్‌లో క్లెయిబ్‌ను పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అదే సమయంలో పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ కోసం సులభతరంగా అందేలా చూడాలని, ఇందు కోసం సెంట్రల్డ్ కేవైసీ డేటాబేస్‌ను తయారు చేసుకోవాలని సిఫారసు చేసింది. గతంలో ఆర్‌బీఐ నియమించిన కమిటీ సోమవారం నివేదికను రిజర్వ్ బ్యాంకుకు సమర్పించింది.
బ్యాంకుల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు సంబంధిత కస్టమర్ సర్వీస్ స్టాండర్డ్స్‌లో తేవాల్సిన మార్పులను సూచించేందుకు ఆర్‌బీఐ ఈ కమిటీని నియమించింది. గతేడాది మే నెలలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కానుంగో నాయకత్వం వహించారు.
కమిటీ సిఫారసుల్లో లోన్లకు సంబంధించి ఇబ్బందులను త్వరగా పరిష్కరించాలని, అలాగే వినియోగదారులు రుణం మొత్తం చెల్లించన తర్వాత ఆస్తికి సంబంధించిన పత్రాలను తిరిగి ఇవ్వడంలో ప్రస్తుతం ఎక్కువగా సమయపడుతోందని తెలిపింది. ఇకపై వెంటనే తిరిగి ఇచ్చేలా చూడాలని, ఇందుకు కాలపరిమితి ఉండాలని సూచించడంతో పాటు ఆలస్యమైతే బ్యాంకుకు జరిమానా విధించాలని చెప్పింది.
బ్యారోవర్ ఆస్తి డాక్యుమెంట్లను బ్యాంకు పోగొడితే మాత్రం బాధితుడు వాటిని తిరిగి పొందేందుకు సహాయం అందించడంతో పాటు ఖర్చులను భరించాలని, కొంత మొత్తం పరిహారం ఇవ్వాలని సూచించింది. ఇతరహా డాక్యుమెంట్లు మళ్లీ సంపాదించుకోవాలంటే చాలా సమయం పడుతుందని తెలిపింది.
పెన్షన్‌దారుల ప్రయోజనాల కోసం కమిఈ కీలక సూచనలు చేసింది. పెన్షనర్లు తమ బ్యాంకులోని ఏదైనా బ్యాంచ్‌లో లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే సౌకర్యం కల్పించాలని సిఫారసు చేసింది.
బ్యాంకుల్లో రద్దీని నివారించేందుకు వారు ఎంచుకున్న ఏ నెలలోనైనా సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు అనుమతించాలని, ఈ నిబంధన అన్ని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిత సంస్థలకు వర్తింపజేయాలని చెప్పింది.
సాలరీ ఖాతాలు ఉన్న వారి విషయంలో ఉదారంగా ఉండాలని, వారి ఆదాయం ఖర్చుల గురించి బ్యాంకులకు అవగాహన ఉంటుంది కాబట్టి ‘హైరిస్క్’ కేటగిరీలో చేర్చొద్దని కమిటీ సూచించింది. స్టూడెంట్స్‌ను కూడా ‘లో రిస్క్’ కేటగిరీలో చేర్చవచ్చని తెలిపింది. గత మూడేళ్లలో వచ్చిన ఫిర్యాదులను కమిటీ సమీక్షించింది.
ఏటా కోటి ఫిర్యాదులు అందుతున్నాయని గుర్తించారు. ఖాతాదారులతో ఫిర్యాదులను వేగంగా, సమర్థంగా పరిష్కరించేందుకు కామన్ కంప్లెయింట్ పోర్టల్‌ను ఆర్‌బీఐ ఏర్పాటు చేయాలని, ఇది అందుబాటులోకి వచ్చేలోపు బాధితుడు తన ఫిర్యాదు స్థితిని తెలుసుకునే విధానాన్ని తేవాలని కమిటీ సూచించింది.
వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించకుండా సిబ్బంది, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వాలని సిఫారసు చేసింది. అలాగే కస్టమర్ సేవలను బలోపేతం చేసేందుకు సాంకేతిక సేవలను బలోపేతం చేయాలని కమిటీ రిజర్వ్ బ్యాంకుకు సూచించింది.