Site icon vidhaatha

కర్ణాటక నేతకు KCR రూ.500 కోట్ల ఎర: రేవంత్

విధాత: కర్ణాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఒక ముఖ్యనేతకు రూ.500 కోట్లు ఆఫర్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం పార్టీ పెద్దలకు తెలియడంతో అప్రమత్తమై సదరు కాంగ్రెస్ నేతకు క్లాస్ పీకారని చెప్పారు. దేశంలో బీజేపీపై పోరాటం చేస్తున్నానని వేదికలెక్కి చెబుతున్న తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

బుధవారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిశాక, బీజేపీకి అనుకూలంగా కేసీఆర్‌ పావులు కదపడం మొదలుపెట్టారని విమర్శించారు. కనీసం పాతిక సీట్లకు తగ్గకుండా కాంగ్రెస్ ను ఓడించాలని ఆ నేతను కోరారని ఆరోపించారు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్‌కు వచ్చే నష్టమేంటని నిలదీశారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కర్ణాటకలో పనిచేస్తున్నారని, వారికి ఆ రాష్ట్రంలో ఏం పని అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపారని, ఈ విషయం తెలిసే జేడీఎస్‌ నాయకుడు హెచ్.డి.కుమార స్వామి ఖమ్మం సభకు డుమ్మా కొట్టారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో వైరం, బద్ధ శతృత్వం ఉందనేలా నమ్మించేందుకు కేసీఆర్‌ ప్రసంగాలు, సవాళ్లు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా బీజేపీపై ద్వేషం, పగ ఉన్నట్లయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేదన్నారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మద్ధతుగా కేసీఆర్‌ ఎందుకు ప్రచారం చేయలేదని నిలదీశారు. ఢిల్లీలో తన లిక్కర్ వ్యాపార భాగస్వామి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఎందుకు మద్ధతు ప్రకటించలేదని ప్రశ్నించారు.

ఇవాళ ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ ఒక బహత్తర ప్రణాళికతో ప్రసంగిస్తారని భావించానని, కానీ కాంగ్రెస్, బీజేపీ లను కలిపి విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉన్నదని అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం, ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను ఎన్నింటినో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇవాళ మోదీ విక్రయిస్తున్న సంస్థలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించినవేనన్నారు.

అలాంటి ప్రధానికి ఇప్పటి వరకు పార్లమెంటులో మద్ధతు ఇచ్చింది కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని రక్షించడానికే కేసీఆర్‌ బీఆర్ఎస్ పార్టీని పెట్టారని రేవంత్‌ ఆరోపించారు. ఖమ్మం సభలో కాంగ్రెస్ పై కేసీఆర్‌ చేసిన విమర్శలను ఆయన ఖండించారు.

Exit mobile version