విధాత: రైతుల భూములకు ప్రభుత్వమే జవాబు దారిగా ఉండే విధంగా కాంగ్రస్ పార్టీ అధికారంలోకి రాగానే టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకు వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకోవడానికి తీసుకువచ్చిన ధరణిని రద్ధు చేసి పారదర్శకమైన వ్యవస్థను తీసుకువస్తామన్నారు.
ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వగ్రామమైన తిమ్మాపూర్లో ఉన్న 146 ఎకరాల భూదాన్ భూమిని కేటీఆర్ ఆయన మనుషులు కాజేశారని ఆరోపించారు.
ఇక్కడ వేయి కోట్ల భూ కుంభకోణానికి కేటీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. తనగ్రామంలోని భూములు అన్యాక్రాంతమవుతుంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కిషన్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లెటర్ ఇస్తే ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఎవరూ రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి వీలులేకుండా చేసిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ధరణిని తీసుకు వచ్చి ధరణిలో నిషేధిత భూముల జాబితాలో చేర్చకుండా కేటీఆర్ అండతో పార్టీ మారి వచ్చిన ఒక ఎమ్మెల్యే తన మనుషులకు రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ప్రస్తుతం ఈ భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లాయన్నారు.
ఇందులో 30 శాతం కమిషన్ కేసీఆర్ కుటుంబానికి ముట్టిందని ఆరోపించారు. కిషన్రెడ్డి లేటర్ ఇచ్చిన తరువాత తమ ప్రభుత్వం ఈ భూములను రక్షించడానికి నిషేధిత జాబితాలో చేర్చితే.. కేసీఆర్ ప్రభుత్వం కాజేసిందన్నారు. ఈ మేరకు ఆపత్రాలను రేవంత్ మీడియాకు చూపించారు.
ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్న రైతులు
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మందు రైతులు పడిగాపులు కాస్తున్నారని రేవంత్ అన్నారు. ధరణి సమస్యలు క్లియర్ కావాలంటే 30% కమిషన్ ఇవ్వాల్సిందేన్నారు. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్ కి ఏడుపు ఎందుకు? అని అడిగారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో కూడా ధరణి బాధితులు తమ ఆవేదన తెలియచేశారన్నారు.
రైతులను బెదిరిస్తున్న కేసీఆర్
కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బంధు, రైతు భీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని బెదిరిస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భూముల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవన్నారు. ఇవన్నీ ఐఎల్ఎఫ్ ఎస్ దివాళాతీసిన సంస్థకు అప్పగించారన్నారు. రూ. 150 కోట్లకు తీసుకున్న ఈసంస్థ రూ.1500 కోట్లకు అమ్ముకుందన్నారు.
ఇది పిలిపిన్స్ నుంచి సింగపూర్ సంస్థకు మారిందన్నారు. ఈ భూముల నిర్వహణ సంస్థలో దొడ్డి దారిన వీళ్ల చేతుల్లోకే వచ్చిందని రేవంత్ ఆరోపించారు. దేశంలో భూముల వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీ సంస్థ చూస్తుందని, ఒక్క తెలంగాణ భూముల వివరాలన్ని ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్లాయన్నారు.
పేదలకు కాంగ్రెస్ పంచిన భూములను ధరణి తెచ్చి పెత్తందార్లకు కట్టబెడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,తిమ్మాపూర్ భూదాన్ భూముల దోపిడీనే దీనికి ఉదాహరణ.ధరణి రద్దైతే కేసీఆర్ 30% కమీషన్ సర్కారు బండారం బయటపడుతుంది.అందుకే కాంగ్రెస్ ధరణిని రద్దు చేస్తానంటే కేసీఆర్ భయపడుతున్నాడు pic.twitter.com/M5zoi4bWvx
— Revanth Reddy (@revanth_anumula) June 12, 2023
భయపడుతున్న సర్కారు
ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందని ప్రభుత్వం భయపడుతోందని రేవంత్రెడ్డి అన్నారు. ధరణి ఫిర్యాదు దారుల నుండి వసూలు చేసే వెయ్యి రూపాయల రుసుము ఎక్కడికి పోతుంది? అని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి విషయంలో కేసీఆర్ స్వార్థం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందన్నారు.
భూ కుంబకోణంలో బీఆర్ఎస్ నేతలు
తిమ్మాపూర్ భూ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతలున్నారని రేవంత్ ఆరోపించారు. కలెక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ తిమ్మాపూర్ భూములను దోచుకుంటున్నారన్నారు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఊచలు లెక్క పెట్టిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో జరిగిన భూముల లావాదేవీలపై విచారణ జరిపిస్తామన్నారు. తన గ్రామ భూములపై అప్పట్లో లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని అడిగారు.
కలెక్టర్లని కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చారన్నారు. ధరణిలో ఉన్నంత దోపిడీ మరేందులో లేదన్నారు. 30% కమీషన్ తీసుకునే ప్రభుత్వం దిగిపోవాలనారు. ధరణి అనేది కేసీఆర్ కి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా మారిందన్నారు. ధరణి విషయంలో కేసీఆర్ పెద్ద దళారీ అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత మాదన్నారు.
పేదలకు భూ పంపిణీ చేసింది.. నక్సలైట్లు, కాంగ్రెస్ పార్టీనే
నక్సలైట్ల నుంచి కాంగ్రెస్ వరకు పేదలకు భూ పంపిణీ చేసిందని రేవంత్ తెలిపారు. యాజమాన్యపు హక్కులు లేని పేదలకు 35 లక్షల ఎకరాలను కాంగ్రెస్ పంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉన్నాయన్నారు. 2004 లో కాగితపు రికార్డులు భూ భారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటలైజ్ చేసిందని తెలిపారు.