MEDAK: ఓటరు నమోదు తీరుపై స‌మీక్ష..

81 శాతం ఆధార్ కార్డు అనుసంధానంపై హ‌ర్షం యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం: క‌లెక్ట‌ర్ హ‌రీష్‌ విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలో ఓటరు నమోదు, సవరణలు, తొలగింపులు, ఆధార్ అనుసంధానం ప్రక్రియను పరిశీలించిన ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు నిర్మల సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డితో కలిసి తహసీల్ధార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని మెదక్, […]

  • Publish Date - December 7, 2022 / 02:34 PM IST
  • 81 శాతం ఆధార్ కార్డు అనుసంధానంపై హ‌ర్షం
  • యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం: క‌లెక్ట‌ర్ హ‌రీష్‌

విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలో ఓటరు నమోదు, సవరణలు, తొలగింపులు, ఆధార్ అనుసంధానం ప్రక్రియను పరిశీలించిన ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు నిర్మల సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డితో కలిసి తహసీల్ధార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని మెదక్, నరసాపూర్ నియోజక వర్గంలో ప్రత్యేక ఓటరు నమోదు కు స్వీప్ ద్వారా చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్మ‌ల మాట్లాడుతూ ఫారం-6 ద్వారా ఓటరు నమోదుకు సమర్పించిన దరఖాస్తులను బి.ఎల్.ఓ. లు గరుడ యాప్ లో ఆన్ లైన్ వెంటనే చేయాలని సూచించారు. ఫారం-7 ద్వారా మరణించిన వారి పేర్లను ముందుగా నోటీసు ఇచ్చి డెత్ సెర్టిఫికెట్ తీసుకున్న తరువాత తొలగించాలని, తిరిగి అవి ఓటరు జాబితాలో కనిపించరాదని చెప్పారు. అదేవిధంగా మైగ్రేటెడ్ ఓటర్లను పరిశీలించాలని, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న వారిని ఓటరుగా నమోదు చేయాలని, డూప్లికేట్ ఓటర్లు లేకుండా సూపర్ చెక్ చేస్తూ పారదర్శకంగా ఓటర్ల తుది జాబితా రూపొందించాలని సూచించారు.

పెండింగులో ఉన్న 1057 అభ్యంతరాలు, క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, స్వయం సహాయక సంఘాలు, పారిశ్రామిక యాజమాన్యాలతో సమావేశమై ఓటరు నమోదుకు ప్రత్యేక చొరవ చూపడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా అవగాహన కార్యక్రమాల అనంతరం స్పందన ఎలా ఉందో ఫీడ్ బ్యాక్ తీసుకొవాలని, వంద శాతం లక్ష్యం సాధించిన వారికి జనవరి 25న ఓటరు దినోత్సవం నాడు ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.

ఓటరు వివరాలకు ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూమ్ నిర్వహించాలని, ఫిర్యాదుల రిజిస్టర్ కూడా నిర్వహిస్తూ వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే తగు చర్య తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇంతవరకు 81 శాతం ఆధార్ కార్డు అనుసంధానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మిగతా 19 శాతాన్ని పూర్తి చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన 11 వేల ఫొటో ఎపిక్ ఓటరు కార్డులను సంబంధిత అభ్యర్థులకు అందజేస్తామన్నారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లు, కళాశాల అంబాసిడర్ల ద్వారా యువతలో అవగాహన కలిగించి మొబైల్ యాప్, ఏ.సి.ఐ పోర్టల్ ద్వారా అర్హులను ఓటరుగా నమోదు చేస్తున్నామని తెలిపారు. సవరణలు, మార్పులు, చేర్పులు, పెళ్ళై వెళ్ళిపోయిన‌ వారి పేర్లు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, నియోజక వర్గం మార్పు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, అభ్యంతరాలను పరిశీలించి పారదర్శకంగా ఓటరు జాబితా చేస్తున్నామని అన్నారు.

జిల్లాలోని 576 పోలింగ్ బూత్ స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యాక్రమాలతో పాటు, ఇంటింటికి తిరిగి అర్హులను ఓటర్లుగా నమోదు చేస్తున్నామన్నారు. 18-19 సంవత్సరాల లోపు యువత 10 వేలకు పైగా ఉన్నారని వారినందరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్లు, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.