Site icon vidhaatha

‘వారాహి’ని వదలని RGV.. పందితో పోలుస్తూ కామెంట్స్‌

విధాత: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహిని సిద్ధం చేశారు. కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక దాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారానికి వినియోగిస్తారు. ఇదిలా ఉండగా పవన్ వేసే ప్రతి అడుగునూ తప్పుబట్టడం.. విమర్శించడమే పనిగా పెట్టుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఈ వాహనాన్ని సైతం వదల్లేదు.

వారాహిని కాస్తా వరాహంతో పోలుస్తూ ఎగతాళి చేశారు. ఆనాడు ఎన్టీయార్ చైతన్య రథం మీద తిరుగుతూ ప్రచారం చేస్తుంటే మీరు మాత్రం పంది బస్సులో వెళ్ళండి.. జనాన్ని తొక్కించేయండి.. అది కుదరకపోతే కేసులు పెట్టించేయండి అని సలహా ఇచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎంతో ముచ్చటపడి చేయించుకున్న ప్రచార రథాన్ని ఆర్జీవి బురద పందితో పోలుస్తూ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులను ఇరిటేట్ చేశారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తుల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. అవసరం అయితే తాము తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళతామన్నారు. లేదంటే ఒంటరి పోటీకి అయినా సిద్ధమేనని ప్రకటించారు.

కొండగట్టుకు వచ్చిన పవన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలని.. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళతామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు.

బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతించిన పవన్ కళ్యాణ్.. మార్పు ఆహ్వానించదగినదే అని అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటున్నారని.. అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని పవన్ కామెంట్ చేశారు.

ఇక ఇప్పటికే తెలంగాణ బీజేపీ తమకు రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు లేదని ప్రకటించింది. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల శ్రీకాకుళంలో గౌరవం దక్కని చోట కలిసి ఉండడం సాధ్యం కాదని ప్రకటించారు. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగానే బీజేపీతో కలిసి ఉంటామన్నారు. దీంతో ఏపీలో పొత్తుల వ్యవహారం తేలితే తప్ప తెలంగాణలోనూ బీజేపీతో జనసేన కలిసి సాగే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఆ పార్టీ స్పందనను బట్టి ఉంటుందని తేల్చేశారు.

Exit mobile version