- మరోసారి ‘రోమియో-జూలియట్’ సినిమా వివాదం
- నాడు సినిమాకు కాస్ట్యూమ్స్, ఫొటోగ్రఫీలో ఆస్కార్ అవార్డులు!
- మానసిక ఒత్తిడికి గురయ్యామంటూ కోర్టుకెక్కిన లియోనార్డ్ వైటనింగ్, ఒలివియా హసీ
విధాత: హాలీవుడ్ చిత్ర జగత్తులో ‘రోమియో-జూలియట్’ సినిమా ఓ సంచలనం. అప్పటిదాకా ఉన్న సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది అనేకంటే… హాలీవుడ్ గమ్యం, గమనాన్నే మార్చేసింది. రోమియో-జూలియట్ కాసుల వర్షం కురిపించటమే కాదు, సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి సరికొత్త సినీ సంస్కృతినీ, విలువలను ప్రతిపాదించింది. అప్పట్లో అదొక చరిత్ర.
‘రోమియో జూలియట్’ నటీ నటులిద్దరూ మైనర్లు. లియోనార్డ్ వైటనింగ్‌కు 16 ఏండ్లు, ఒలివియా హసీకి 15ఏండ్లు. ఈ టీనేజీ వయస్సులో నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ వారితో ‘రోమియో జూలియట్’ సినిమాలో నటింపజేసింది. ఈ సినిమా 1968లో విడుదలైంది.
అయితే… ఆ సినిమా వచ్చిన 60 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమా నిర్మాణ సంస్థ మీద ఆ నటీ నటులు కేసు వేశారు. నిర్మాణ సంస్థ తమను మోసం చేసిందని, మొదట్లో చెప్పినట్లు కాకుండా బలంతంగా తమతో నగ్నంగా నటించేలా వత్తిడి చేశారని తమ 70 ఏండ్ల వయసులో ఇప్పుడు వారు పారామౌంట్ పిక్చర్స్‌పై కేసు వేశారు.
‘రోమియో జూలియట్’ నటులు లియోనార్డ్ వైటనింగ్, ఒలివియా హసీ తమకు ఇష్టం లేకున్నా వత్తిడి చేసి తమతో నగ్నంగా నటింప చేయటంతో తాము ఎంతో మానిసిక వత్తిడికి, వేదనకు గురయ్యామంటూ కోర్టు కెక్కారు. ఆ క్రమంలోనే వారు తమ మానసిక వత్తిడి నుంచి ఉపశమనం కోసం చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. అందుకుగాను ప్రతిఫలంగా తమకు 500 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు.
సినిమాలో నటించేందుకు చేసుకొన్న ఒప్పందంలో నగ్నంగా తీసే బెడ్ రూమ్ సీన్‌లను చర్మపు రంగు బట్టలతో షూటింగ్ జరుపుతామని నిర్మాణ సంస్థ తెలిపింది. కానీ ఆ తర్వాత మాట మార్చింది. నిర్మాణ సంస్థకు అనుగుణంగా సినిమా డైరెక్టర్ ఫ్రాంకో కూడా ఆ బెడ్ రూమ్ సీన్లను సహజంగా తీస్తేనే సినిమా నడుస్తుందనీ లేకపోతే.. తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పుకొచ్చారు. సహజంగా ఉండేందుకు నగ్నంగా నటించాలని వత్తిడి తెచ్చింది నిర్మాణ సంస్థ. ఆ క్రమంలో వారు నగ్నంగా నటించారు.
2018లో కూడా ఒలివియా ఆ నగ్నసీన్‌లకు సంబంధించి మద్దతుగా మాట్లాడారు. ఆ సందర్బానుసారంగా తాము అలా నటించామని చెప్పుకొచ్చారు. కథా విషయం డిమాండ్ మేరకు నటించామని తెలిపారు. ఆ బెడ్ సీన్ల తర్వాత వారిద్దరూ తాము బట్టలు లేకుండా నటించామనే విషయాన్నే మర్చిపోయామని తెలియజేశారు.
కానీ ఇప్పుడు అకస్మాత్తుగా నాటి సినిమాను వివాదం చేయటం పట్ల హాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతున్నది. అన్నింటికన్నా ఆలోచించాల్సిన విషయం ఏమంటే… రోమియో జూలియట్ సినిమా నాలుగు అంశాల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకొన్నది. అందులో కాస్ట్యూమ్స్, ఫోటో గ్రఫీ అవార్డులున్నాయి.
అంటే… బట్టలు లేకుండా నటించినందుకు కాస్ట్యూమ్స్ కేటగిరీ, నగ్నంగా కనిపించినందుకు ఫొటోగ్రఫీ కేటగిరీలో ఆస్కార్ అవార్డులొచ్చాయా…! అని చెవులుకొరుక్కొంటున్నారు.