Site icon vidhaatha

గోల్డెన్ గ్లోబ్ 2023 రేసులో RRR.. ప్రభాస్ పిచ్చ హ్యాపీ

విధాత: దేశ విదేశాలలో ట్రిపుల్ ఆర్ సృష్టిస్తోన్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ట్రిపుల్ ఆర్ మేనియా ప్రస్తుతం ప్రపంచం అంతా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా దర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాకు ఎంతో మ‌న్న‌న ద‌క్కుతోంది. రిలీజ్ అయిన ప్రతి చోట అద్భుత రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విదేశీ అవార్డుల్లోనూ దుమ్ము దులుపుతోంది.

తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ట్రిపుల్ ఆర్ నామినేట్ కావ‌డ‌మే కాదు.. ‘నాటు నాటు’ అనే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఇంతకుముందు బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్‌‌లో ట్రిపుల్ ఆర్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇంతలోనే ఈ గోల్డెన్ గ్లోబల్ అవార్డు పురస్కారం ద‌క్క‌డం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఇటీవల జపాన్‌లో కూడా ట్రిపుల్ ఆర్ 25 ఏళ్ల నాటి ‘ముత్తు’ రికార్డును బద్దలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్‌లో గోల్డెన్ గ్లోబ్స్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని తెలిపింది. ఆర్ఆర్‌ఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ పోస్టును తాజాగా రీట్వీట్ చేసింది. మ‌రో ట్వీట్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ రెండు పురస్కారాల కోసం నామినేషన్లలో ఉందని గోల్డెన్ గ్లోబ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు భారతీయ సినీ ప్రేమికులు దీనిపై హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు గౌరవం ఉన్న అవార్డులకు నామినేట్ కావడంపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతూ గ్రేటెస్ట్ ఎస్ఎస్ రాజమౌళిగారు ప్రపంచాన్ని జయించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉత్తమ డైరెక్టర్‌గా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అలాగే లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్‌ను అందుకున్నందుకు కంగ్రాట్స్ అని ప్రభాస్ పోస్ట్ పెట్టి అభినందించాడు.

తాజాగా కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కోసం నామినేట్ కావడంపై ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుకు నామినేట్ కావడం చాలా గర్వంగా ఉంది. ఈ ఘనతకు కారణమైన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు అని ప్రభాస్ త‌న పోస్టులో తెలిపాడు.

ఇక ఈ అవార్డు నామినేషన్ పై రాజ‌మౌళి ట్వీట్‌ చేస్తూ గోల్డ్ అండ్ గ్లోబల్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్‌ మూవీకి రెండు కేటగిరీలలో నామినేషన్స్ లభించినందుకు జూరీకి, అభిమానులకి, ప్రేక్షకులకి, తమకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు అంటూ ముగించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేస్తూ ఆర్ఆర్ఆర్‌ మూవీకి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్‌లో రెండు కేటగిరీలలో అర్హత లభించినందుకు ఎంతో సంతోషంగా,ఆనందంగా ఉంది. ఎంతో లవ్లీగా డెలైట్ ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ ఘ‌న‌త‌కు స‌హ‌క‌రించిన అందరికీ శుభాకాంక్ష‌లు, ధన్యవాదాలు అని తెలిపాడు.

Exit mobile version