- పార్టీలకతీతంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం
- గెలుపోటములను శాసిస్తాం
- నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో కే.రాజిరెడ్డి
- భారీగా హాజరైన ఆర్టీసీ కార్మికులు
విధాత, నల్గొండ: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ లోపే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ కే.రాజి రెడ్డి మాట్లాడుతూ ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఆత్మ గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక్క నియామకం ఆర్టీసీలో చేపట్టలేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు 57 వేల మంది ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం 47 వేల మంది మాత్రమే ఉన్నారని, తెలంగాణలో ఆర్టీసీ కుంచించుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టీసీలో కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందని, కార్మికులపై వేధింపులు పెరగడంతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇకనైనా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 55 రోజులు సమ్మె చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని, సమ్మెలో పాల్గొన్న కార్మికులకు టీఆర్‌ఎస్ పార్టీ కనీసం మద్దతు కూడా తెలుపలేదని అన్నారు. నియోజకవర్గంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని విఫలం చేసేందుకు కొంతమంది నాయకులు కుట్ర పన్నారని అయినా కూడా వాటన్నిటినీ చేధించి కార్మికులు ఈ సమావేశానికి రావడం హర్షణీయమన్నారు.
ఆర్టీసీలో నిర్వీర్యం చేసిన యూనియన్ వెంటనే పునరుద్ధరించాలని, 16% ఐఆర్,30 % పిట్ మెంట్, 6 డిఏ లను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రిటైరయిన ఉద్యోగుల సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు తమ సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు.
నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు.ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపోటములు అయినా తాము శాసిస్తామన్నారు. ఈ సమ్మేళనంలో దుబ్బాక యాదయ్య,సురేష్, ఈద శంకరయ్య, కె వెంకట్ రెడ్డి, బోయ అంజయ్య, రవీందర్ రెడ్డి,సాగర్, సత్తయ్య, గనం నరసింహ, సోమేశ్వర్, ఎం.వి.చారి, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.