విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ప్రతి రోజు విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక నిరసనలు, ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ట్యాంక్‌బండ్ వద్ద సాగరహారం చేపట్టి నేటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు జై తెలంగాణ అని నినదించిన రోజు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతి రోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిలను కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు.