Site icon vidhaatha

సాయిపల్లవి ఇలా మారిపోయిందేంటి?

విధాత‌: ప్రస్తుతం తెలుగులో ఉన్న ప్రతిభావంతులైన హీరోయిన్లలో సాయి పల్లవి పేరు ముందుగా చెప్పుకోవాలి. నటనలో సత్తా ఉండి, డాన్సులు కూడా బాగా చేయగలిగి, ఎంతో టాలెంట్ ఉన్న వారిలో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, ర‌ష్మికా మందన్న‌ల‌తో పాటు సాయి పల్లవికి స్థానం తప్పకుండా లభిస్తుంది.

వాస్తవంగా చెప్పాలంటే నేడు కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్‌ల కంటే సాయి పల్లవికి ఉన్న క్రేజే ఎక్కువ. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఎందుకనో ఆమెను అందరూ మలయాళీ భామ అనుకుంటారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.

తన 14వ ఏటనే సినీ ప్రస్తానాన్ని ప్రారంభించి పలు చిత్రాలలో నటించింది. 2015లో ఏకంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఈమె నటించిన మొదటి చిత్రం 2015‌లో వచ్చిన ప్రేమమ్‌. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అదే సమయంలో తెలుగు సినీ మేకర్స్ చూపు ఆమెపై పడింది. తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

ఫిదాలో నటించిన‌ భానుమతి పాత్ర ఆమెకు చాలా కాలం ఇంటిపేరుగా మారిపోయింది… ఇంటిపేరు అని కూడా చెప్పలేం… మారుపేరుగా మారిపోయిందని చెప్పాలి. ఇక తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యాం సింగరాయ్‌, విరాటపర్వం వంటి చిత్రాలలో మెప్పించింది.

ఈ చిత్రాల్లో కొన్ని సరిగా ఆడకపోయినా సాయి పల్లవికి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందరూ ప్రశంసించే స్థాయికి ఆమె చేరుకుంది. ఈమె గతంలో ఒకసారి తాను పుట్టపర్తి సాయిబాబాకు భక్తురాలినని తన ఫ్యామిలీకి కూడా పుట్టపర్తి సాయిబాబా అంటే బాగా నమ్మకం అని తెలియజేసింది.

Exit mobile version